Inter Hall Tickets 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయంలో మాత్రమే హాల్‌టికెట్లు జారీ చేసేవారు. దీంతో విద్యార్ధులు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే క్రమంలో..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవనున్నాయి. అయితే గతంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయంలో మాత్రమే హాల్‌టికెట్లు జారీ చేసేవారు. దీంతో విద్యార్ధులు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే క్రమంలో హడావుడిగా తమ వివరాలు నింపేవారు. ఫలితంగా హాల్ టికెట్లలో తప్పులు దొర్లేవి. ఆయా వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే బోర్డు వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా హాల్‌టికెట్‌లో తప్పులు దొర్లుతాయి. ఇలా దొర్లిన తప్పులను పరీక్ష సమయంలో జారీ చేసే హాల్ టికెట్లలో చూసుకుని విద్యార్ధులు ఖంగు తినేవారు.
ఇలాంటి తప్పుల్లో ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్టు రావడం, పరీక్షల మీడియం, ఫొటోలు మారడం, పేర్లు తప్పుగా పడటం వంటివి గతంలో చోటుచేసుకునేవి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంటర్ బోర్డు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఏడాది ఇంటర్ బోర్డు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. హాల్ టికెట్లలో దొర్లే తప్పులను సవరించుకునేందుకు ముందస్తు నమూనా హాల్‌టికెట్లను జారీ చేస్తోంది. వాటిల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకునే అవకాశం కల్పించింది.
ఏలా సరి చేసుకోవాలంటే..
నమూనా హాల్‌టికెట్లు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో దరఖాస్తు ఇచ్చిన విద్యార్ధి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు వస్తాయి. ఇందులో పరీక్ష కేంద్రం వివరాలు, హాల్‌టికెట్ నంబరు కనిపించవు. ఇవికాకుండా మిగతా వివరాలు అంటే విద్యార్థి ఫొటో, గ్రూప్, మాధ్యమం, సంతకం, సబ్జెక్టుల వివరాలు ఉంటాయి. వీటిల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే ప్రిన్సిపల్‌ను సంప్రదించాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులైతే పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్ధులైతే ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఈ అవకాశం జనవరి 25, 2026 వరకు మాత్రమే ఉంటుంది. ఫిబ్రవరి 2 నుంచి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 25 నుంచి అన్ని గ్రూప్‌ల వారికి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. మరో రెండు రోజులే ఉన్నందున విద్యార్ధులు హాల్ టికెట్లపై తప్పులు సవరించుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




