AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Technology: ఇది నోట్లో వేసుకుంటే పాటలు వినిపిస్తాయి.. అదరగొడుతున్న కొత్త టెక్నాలజీ! ఇది నిజంగా కొత్తదేనా?

New Technology: CES షోకి వచ్చిన సందర్శకులు ఈ లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని, తమ తల లోపల వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యూజికల్ లాలీపాప్ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి..

New Technology: ఇది నోట్లో వేసుకుంటే పాటలు వినిపిస్తాయి.. అదరగొడుతున్న కొత్త టెక్నాలజీ! ఇది నిజంగా కొత్తదేనా?
New Technology
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 3:38 PM

Share

New Technology: సాధారణంగా మనం పాటలు వినాలంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటాం లేదా స్పీకర్లు వాడుతుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఒక లాలీపాప్ తింటూ పాటలు విన్నారా? వినడానికి వింతగా ఉన్నా.. లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ఈ సరికొత్త ఆవిష్కరణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఏమిటీ ‘మ్యూజికల్ లాలీపాప్’?:

ఈ లాలీపాప్‌ను నోట్లో పెట్టుకోగానే అది మీ తలలో నేరుగా సంగీతాన్ని ప్లే చేస్తుంది. దీని వెనుక ఉన్న రహస్యం బోన్ కండక్షన్ టెక్నాలజీ. ఈ లాలీపాప్ మీ పళ్ళ ద్వారా మీ దవడ ఎముకలకు కంపనాలను పంపిస్తుంది. ఆ కంపనాలు నేరుగా మీ లోపలి చెవికి చేరడం వల్ల వేరే ఎవరికీ వినిపించకుండా కేవలం మీకు మాత్రమే పాటలు వినిపిస్తాయి. మీరు లాలీపాప్‌ను కొరికినప్పుడల్లా లేదా దాన్ని నోటిలో అటు ఇటు తిప్పినప్పుడల్లా సంగీతం తీవ్రత మారుతుండటం గమనార్హం.

CES 2026లో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచినప్పటికీ ఇది పూర్తిగా కొత్త ఆవిష్కరణ ఏమీ కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. సుమారు 1990లలో టూత్ ట్యూన్స్ అనే పేరుతో ఇలాంటి పరికరాలు అందుబాటులో ఉండేవి. బ్రష్ చేసుకుంటున్నప్పుడు పిల్లలకు బోర్ కొట్టకుండా సంగీతం వినిపించడానికి వీటిని వాడేవారు. అయితే ఇప్పుడు వచ్చిన వెర్షన్ మాత్రం మరింత ఆధునికమైన డిజైన్‌తో, స్పష్టమైన సౌండ్ క్వాలిటీతో అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రత్యేకతలు:

ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. మీకు నచ్చిన పాటలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కేవలం టెక్నాలజీ పరికరం మాత్రమే కాదు, రుచికరమైన స్ట్రాబెర్రీ, మింట్ వంటి వివిధ ఫ్లేవర్లలో కూడా లభిస్తుంది. ముఖ్యంగా టాబ్లెట్లు వేసుకోవడానికి ఇష్టపడని పిల్లలకు లేదా పళ్ళు తోముకోవడానికి మారాం చేసే పిల్లల కోసం ఇలాంటి పరికరాలను భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది.

CES షోకి వచ్చిన సందర్శకులు ఈ లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని, తమ తల లోపల వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలకు పోజులిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యూజికల్ లాలీపాప్ వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం ఆహారం తినే పద్ధతులు కూడా ఎంత వినోదభరితంగా మారుతున్నాయో చెప్పడానికి ఈ లాలీపాప్ ఒక నిదర్శనం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us