Lance Naik Sai Teja: సీడీఎస్ బిపిన్ రావత్ గురించి.. సాయితేజ తన తండ్రితో చెప్పిన కీలక విషయాలు ఇవే
సామాన్య సైనికుడిగా చేరి సాయితేజ అంచెలంచెలుగా ఎదిగిన తీరు అచ్చెరువొందిస్తుంది. మాతృదేశ సేవలో తరించడం యువతరం బాధ్యతగా భావించారు సాయితేజ.

సామాన్య సైనికుడిగా చేరి సాయితేజ అంచెలంచెలుగా ఎదిగిన తీరు అచ్చెరువొందిస్తుంది. మాతృదేశ సేవలో తరించడం యువతరం బాధ్యతగా భావించారు సాయితేజ. దేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అనుంగ శిష్యుడిగా మారాడు. యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచారు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన ఓ సామాన్యుడు ఆర్మీమెరుపు దాడుల్లో సిద్ధహస్తుడిగా ఎలా మారాడు? యావత్ దేశానికే గర్వకారణంగా ఎలా నిలిచారో తెలుసుకుందాం పదండి.
సాయితేజ తాను భావించినట్టుగానే రెండు పదులు దాటకుండానే సైన్యంలో చేరాడు. 2013లో బెంగళూరు రెజిమెంట్ నుంచి ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యాడు. మొదట ఆర్మీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించాడు. 2014లో పారా కమాండో ఎగ్జామ్ రాసి సెలక్ట్ అయ్యాడు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగాడు సాయితేజ. 11వ పారాలో లాన్స్ నాయక్ గా చేరాడు. 2020 వరకు బెంగళూరులోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ట్రైనర్ గా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తించాడు.
పారా కమాండర్‌గా మారిన తరువాత ఎంపిక నుంచి శిక్షణ వరకు అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొని నిలిచారు సాయితేజ. మెరుపుదాడులు చేయడంలో దిట్టలైన వీరికి సైన్యంలో ప్రత్యేక స్థానం ఉంది. పారా కమాండోగా బెంగళూరుతో పాటు వివిధ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా రాటుదేలేందుకు కఠోర శిక్షణ పొందారు. ఆకాశమార్గంలో నేరుగా శత్రుస్థావరాలకే వెళ్లి, వారిని మట్టి కరిపించే పారా ట్రూపర్‌గా ఎదిగారు. ఇందుకోసం ప్రత్యేకమైన కఠిన శిక్షణ పొందారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ కొత్తగా వచ్చే పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదగడం ఆయనలోని అద్భుతశక్తిసామర్థ్యాలకు ప్రతీక.
అంతేకాదు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌నే మెప్పించగల స్థాయికి చేరారు సాయితేజ. మెరుపు వీరుడు సాయితేజలోని శక్తియుక్తులను గుర్తించిన బిపిన్ రావత్, సాయితేజను తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు. బిపిన్ రావత్ తనని సొంత బిడ్డలా చూసుకొంటోన్న తీరు సాయితేజలో స్ఫూర్తిని నింపింది. అదే విషయాన్ని తండ్రితో చెప్పేవారంటూ బిడ్డ ఆశయాలను గుర్తుచేసుకుంటున్నారు సాయితేజ తండ్రి.
బిపిన్ రావత్ మనసు మెప్పించి, శెభాష్ అనిపించుకున్నారు సాయితేజ. తానున్నంత వరకూ తనతోనే ఉండాలని జనరల్ బిపిన్ రావత్ చెప్పేంత ఉన్నత స్థాయికి బిపిన్ రావత్ ఎదిగారు. సాయితేజ తండ్రి తన కొడుకు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ,….ఎక్కడో మారుమూల అడవిలాంటి పల్లెలో పుట్టిన మేమెక్కడ, దేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ఎక్కడ? అలాంటి వ్యక్తిని నమ్ముకుని విశ్వాసంగా, నిబద్దతతో నా బిడ్డ పనిచేయడం నాకు గర్వకారణం అంటున్నారు సాయితేజ తండ్రి.
బిపిన్ రావత్ త్వరలో దేశ ప్రధాని మోదీకి పర్సనల్ సెక్రటరీగా వెళ్ళబోతున్నారా? అవును ఇదే విషయాన్ని సాయితేజ తన తండ్రితో చెప్పారని గుర్తు చేసుకున్నారు సాయితేజ తండ్రి. తనకేం కాదనీ, బిపిన్ రావత్ వెన్నంటే ఉంటాననీ, తన గురించి దిగులుపడొద్దనీ చెప్పిన సాయితేజ, బిపిన్ రావత్ పదవీకాలం పూర్తయిన తరువాత జనవరిలో సెలవు తీసుకొని, మార్చిలో ప్రధాని మోదీకి పర్సనల్ సెక్రటరీగా బిపిన్ సర్ వెళ్ళబోతున్నారనీ చెప్పిన సాయితేజ ఎదుగుదలను తలుచుకొని గర్వపడుతున్నారు ఆయన తండ్రి.
నేనున్నంత వరకూ నాతోనే ఉండాలన్న బిపిన్ రావత్ అంతలోనే వీరమరణం పొందారు. విధుల్లో ఉండగానే త్రివిధ దళాధిపతితో పాటు ఆయన వ్యక్తిగత రక్షకుడు సాయితేజ సైతం గురువుచెంతనే అసువులు బాయడం యావత్ దేశప్రజల్లో విషాదాన్ని నింపింది.
Also Read: మత్తెక్కిస్తున్న ‘ఊ.. అంటావా.. ఊహూ అంటావా మావా’ సాంగ్.. యూట్యూబ్‌లో సెన్సేషన్
Andhra Pradesh: రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు
