AP: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లోని మహిళల రుణాలన్నీ మాఫీ
ఇటీవల కాలంలో సీమపై వరుణుడు దండెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి.
ఇటీవల కాలంలో సీమపై వరుణుడు దండెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీగా ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించి లోన్స్ మాఫీ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్‌హెచ్‌జీ రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని లోన్స్ మాఫీ చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తంగా రూ.8.98 కోట్ల రుణాల్ని మాఫీ చేసేందుకుగానూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అన్నమయ్య ప్రాజెక్టుకు వచ్చిన ఆకస్మిక వరదలతో ఆ ప్రాంతం తీవ్రంగా నష్టపోయినందున ఏకకాల పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాజంపేట మండలంలోని గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాలకు చెందిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందని గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ గ్రామీణ బ్యాంక్, కెనరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వివిధ పథకాల కింద ఉన్న మహిళల లోన్స్ మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్… త్వరలోనే ఆ పోస్టులు భర్తీ