Tirumala: తిరుమల ట్రస్ట్‌కు భారీ విరాళం.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
తిరుమల శ్రీవారికి భక్తులు రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు కోట్ల విలువైన కానుకలు ఇస్తుంటారు. తాజాగా ఆర్‌ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ స్వామివారికి విలువైన కానుకలు అందించాయి. ఈ కానుకల విలువ దాదాపు రూ.4.3కోట్లు. దీనికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రత్యక్ష కలియుగ దైవం తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. రోజుకు వేల మంది స్వామివారిని దర్శించుకుని తరించిపోతారు. ఈ క్రమంలో శ్రీవారికి విలువైన కానుకలు సమర్పిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంకు భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలైన ఆర్‌ఎస్‌బి రీటైల్ ఇండియా లిమిటెడ్, ఆర్‌ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిపి రూ. 4.03 కోట్లు విరాళంగా అందజేశాయి. ఈ విరాళం టీటీడీ నిర్వహిస్తున్న బర్డ్ ట్రస్ట్‌కు అందించారు.
ఆర్‌ఎస్‌బి రీటైల్ ఇండియా లిమిటెడ్ టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు సుమారు రూ. 2.93 కోట్లు విరాళం ఇచ్చింది. ఆర్‌ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ బర్డ్ ట్రస్ట్‌కు రూ. 1.10 కోట్లు విరాళం ఇచ్చింది. ఈ విరాళాలకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను ఆయా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌలి, టి. ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీకుమారిలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరిలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.
అన్నప్రసాదం ట్రస్ట్‌కు కూడా విరాళం:
ఈ విరాళాలతో పాటు నరసరావుపేటకు చెందిన భక్తుడు రామాంజనేయులు శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 10 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ భారీ విరాళాలు టీటీడీ చేపడుతున్న సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు, ముఖ్యంగా బర్డ్ ట్రస్ట్ ద్వారా పేదలకు అందించే వైద్య సేవలకు మరింత తోడ్పడనున్నాయి. గతంలో కూడా ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థ టీటీడీ ట్రస్టులకు పలుమార్లు భారీ విరాళాలు అందజేసింది. ఇది శ్రీవారి భక్తుల ఆధ్యాత్మిక నిబద్ధత, సేవా భావాన్ని మరోసారి చాటి చెప్పింది.
గదుల సమస్యలకు చెక్
మరోవైపు తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ వసతి భవనంలో కల్పించిన సౌకర్యాలను, ప్రత్యేకించి హాళ్లు, కల్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్నప్రసాద వితరణ కేంద్రాలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించగలదని తెలిపారు. కొత్తగా నిర్మించిన ఈ పీఏసీ–5 భవనంలో 2,500 మంది యాత్రికులు బస చేయవచ్చని వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




