AP News: వామ్మో.. కాకినాడ పోర్ట్ నుంచి ఇంత యవ్వారం నడిచిందా.. నాదెండ్ల మొత్తం చెప్పేశారుగా
కాకినాడ పోర్టు నుంచి గత మూడేళ్లలో కోటి 30లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎం జగన్‌కు తెలియకుండా ఇది జరగదన్నారు.
తాము ఎందుకు కాకినాడ పోర్ట్ పైన దృష్టి సారించామనే విషయం ప్రజలందరికీ తెలియాలన్నారు ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. గత ఐదేళ్లలో ఎవ్వరినీ పోర్టు లోపలికి అనుమతించలేదని తెలిపారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా చేశారని ఆరోపించారు. మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు. దీని విలువ 45 వేల కోట్లు ఉంటుందన్నారు. పవన్ కల్యాణ్ పర్యటన తరువాతే ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు.
అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ లక్ష్యమన్నారు మంత్రి నాదెండ్ల. అసలు కాకినాడ పోర్టును మాజీ సీఎం జగన్ ఎందుకు తన గుప్పిట్లోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కాకినాడ పోర్ట్‌ను తన చేతుల్లోకి లాక్కోడానికి జగన్ ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారో చెప్పాలన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేశామని తెలిపారు నాదెండ్ల. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గోడౌన్లలో తనిఖీలు చేశామని.. పట్టుకున్న బియ్యంలో 25 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామని తెలిపారు. ఆయా గోడౌన్ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు.