Telangana: ‘మమ్మీ ఒక్కసారి చూడవే..’ ఉరికి వేలాడుతున్న తల్లి వద్ద చిన్నారుల ఆక్రందన
రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులను బడికి పంపి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బడి నుండి తిరిగి వచ్చిన పిల్లలు తల్లి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో హృదయ విదారకంగా రోదించారు. తల్లి మరణంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోజూ లాగే పిల్లలను బడికి పంపి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం బడి నుండి ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు తలుపు వేసి ఉండటంతో పిలిచినా స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చారు. వారు తలుపు పగులగొట్టి చూడగా, తల్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఈ దృశ్యం చూసి పిల్లలు ‘మమ్మీ… మమ్మీ…’ అంటూ రోదించగా, అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.
బొప్పాపూర్‌కు చెందిన ఈరవేణి పరశురాములు-రామవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కృష్ణహరి, వీర్నపల్లికి చెందిన రమ్యను వివాహం చేసుకున్నాడు. రమ్య-కృష్ణహరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూతురు లాస్య (10), కుమారులు ప్రణవ్ (8), నిషాల్ (5). కృష్ణహరి బతుకు దెరువు కోసం రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుండి రమ్య పిల్లలతో కలిసి ఇంట్లోనే ఉండేది. అత్తామామలు పెద్ద కుమారుడితో ఉంటున్నారు.
ఈ క్రమంలో రమ్యకు కుటుంబ సభ్యులతో చిన్నపాటి కలహాలు ఉండేవి. మనస్తాపానికి లోనైన ఆమె, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. సంఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మరణంతో ముగ్గురు చిన్నారులు అనాథలైపోగా, తండ్రి విదేశాల్లో ఉండటంతో పిల్లల రోదనలు గ్రామంలోని అందరినీ కలచివేశాయి. తల్లి ప్రేమను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి చూసి గ్రామంలోని ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.




