మేలిమి బంగారం ముసుగులో మెగా మోసం.. చివరకు జరిగిందిదే..
అదృష్టం తలుపు తట్టినప్పుడు అవకాశం సద్వినియోగపరచుకోవాలి.. లేదంటే మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం.. రండి తక్కువ ధరకే బంగారాన్ని మీ సొంతం చేసుకోండి అంటూ ఓ అమాయకునికి గాలమేశారు కేటుగాళ్లు. నమ్మించి నయవంచన చేసి అతని వద్ద ఉన్న రూ. 18 లక్షలతో ఉడాయించారు. తరువాత కటకటాల పాలయ్యారు. సినీ పక్కీలో జరిగిన ఈ మోసాన్ని తెలుసుకోవాలంటే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలానికి వెళ్లాల్సిందే.

తక్కువ ధరకే మేలిమి బంగారం ఇస్తామంటూ మోసం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజంపేట డీఎస్పి చైతన్య ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత కొద్దిరోజుల క్రితం ఓబులవారిపల్లి మండలం ఎల్లాయి పల్లెలో తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ చేకూరి రమణయ్య అనే వ్యక్తిని కొందరు కేటుగాళ్ళు మోసం చేశారు. రమణయ్య వద్ద డబ్బులు ఉన్నాయన్న విషయం తెలిసి ముగ్గురు వ్యక్తులు ముందుగా రమణయ్యతో స్నేహం చేశారు. అనంతరం తమ వద్ద మేలిమి బంగారు ఉందని తక్కువ ధరకే ఇస్తామని అతన్ని మోసం చేసి అతని వద్ద నుంచి రూ.18 లక్షలు తీసుకుని ముగ్గురు పారిపోయారు. తాను మోసపోయిన విషయం తెలుసుకున్న రమణయ్య ఓబులవారిపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఓలార్ పల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట సమీపంలో పర్వతాల సురేంద్ర, మాచం రెడ్డప్ప, ముంతల వెంకటేష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు.
పోలీసు విచారణలో పలు విస్తుగోలిపే విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులకు పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ పలు ప్రాంతాల్లో మోసం చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ముగ్గురిపై కాళహస్తి, పీలేరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైన విషయం బయటపడింది. పట్టుబడి నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 1,45,000 నగదును స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయస్థానానికి హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్పి చైతన్య మాట్లాడుతూ రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాలలో మాయ మాటలు చెప్పి తక్కువ ధరకే మేలిమి బంగారం ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠా సంచరిస్తుందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి మోసగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఇలా అనుమానితులు ఎవరైనా ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. రైల్వే కోడూరు సిఐ సురేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..