AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత దేహంతో 3 నెలలు.. పిల్లి చనిపోయిందంటూ కథలు.. పోలీసులే నివ్వెరపోయిన ఘటన..

Eluru: కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తు పట్టలేనంతగా ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇంటిపై పోర్షన్లో వృద్ధురాలి మృతదేహం ఉన్నా అదే ఇంట్లో కింది పోర్షన్‌లో ఉంటున్న తన కోడలు మాత్రం విషయం తనకేం తెలియదని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకే కన్న తల్లిని చంపి విషయం బయటకు..

మృత దేహంతో 3 నెలలు.. పిల్లి చనిపోయిందంటూ కథలు.. పోలీసులే నివ్వెరపోయిన ఘటన..
Durga Prasad And Mother Nagamani
B Ravi Kumar
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Sep 26, 2023 | 7:37 PM

Share

ఏలూరు, సెప్టెంబర్ 26: కన్న తల్లి కనిపించకుండా పోతే ఎవరైనా వెతుకుతారు. కానీ ఆ కొడుకు మాత్రం అలా చేయలేదు. ఇక ఆయన భార్య ఇంటి గుట్టు బయటకు రాకుండా కాపాడేందుకు విఫలయత్నం చేసింది. అయితే నేరం దాగుతుందా..? ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారం రావటంతో అధికారులు రంగంలోకి దిగారు. జీర్ణదశకు చేరుకున్న వ్రృద్ధురాలి శవాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ అమానుష ఘటన ఏలూరులో జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి గుర్తు పట్టలేనంతగా ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇంటిపై పోర్షన్లో వృద్ధురాలి మృతదేహం ఉన్నా అదే ఇంట్లో కింది పోర్షన్‌లో ఉంటున్న తన కోడలు మాత్రం విషయం తనకేం తెలియదని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్న కొడుకే కన్న తల్లిని చంపి విషయం బయటకు రాకూడదనే భయంతో సుమారు 3 నెలలుగా ఆమె మృతదేహాన్ని ఇంటిపై పోర్షన్లో ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

తంగేళ్ళమూడి యాదవ నగర్‌లో బసవ దుర్గా ప్రసాద్.. భార్య లలిత, తల్లి నాగమణితో కలిసి నివసిస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య లలిత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. అయితే వారు నివసిస్తున్న ఇంటి నుండి గత కొంత కాలంగా దుర్వాసన వస్తుంది. దీంతో చుట్టుపక్కల వారు దుర్గాప్రసాద్, లలితను దుర్వాసన ఏమిటని ప్రశ్నించగా పిల్లి చనిపోయిందంటూ కథలు చెబుతూ వచ్చారు. కానీ ఎంతకీ దుర్వాసన తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్వాసన వస్తున్న ఇంటిపై పోర్షన్‌కి వెళ్లి తలుపులు ఓపెన్ చేసి చూడగా అక్కడ కుళ్ళిపోయిన స్థితిలో పురుగులు పట్టి వృద్ధురాలి మృతదేహం వారికి కనిపించింది. దాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె చనిపోయి సుమారు మూడు నెలలు అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శరణార్థ నాగమణిగా పోలీసులు గుర్తించారు.

అయితే ఆ ఇంటి కింద పోర్షన్‌లోనే నాగమణి కొడుకు దుర్గాప్రసాద్, అతని భార్య లలిత ఉంటున్నారు. మృతురాలి కుమారుడు దుర్గాప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మృతురాలి కోడలు లలిత మాత్రం తనకు ఏమీ తెలియదని, తన అత్త తమకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్లు భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇంటి నుండి వచ్చే దుర్వాసనపై స్థానికులు ప్రశ్నించినప్పుడు పిల్లి చనిపోయిందని అందుకే దుర్వాసన వస్తుందని చుట్టూ పక్కల వారిని నమ్మించారు. ఇప్పుడు తీరా వృద్ధురాలి మృతదేహం బయటపడటం, కొడుకు దుర్గాప్రసాద్ పరారీలో ఉండటం, కోడలు లలిత తన అత్త నాగమణి తమకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, కొడుకు దుర్గాప్రసాదే తన తల్లిని చంపి భయంతో మృతదేహాన్ని పై పోర్షన్లో దాచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న ఏలూరు డిఎస్పి శ్రీనివాసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అలాగే మృతురాలి నాగమణి మృతదేహాన్ని మూడు నెలలుగా దాచిపెట్టడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆమె సహజంగా మరణిస్తే ఎందుకు ఇన్ని రోజులు మృతదేహాన్ని దాచి పెట్టారు..? ఒకవేళ ఇది హత్య..? హత్య అయితే దానికి గల కారణం ఏమిటి..? లేకపోతే ఆత్మహత్య..? ఆత్మహత్య అయితే మృతదేహం కుళ్ళిపోయే వరకు పోలీసులకు ఇన్ని రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు దర్యాప్తులోనే నాగమణి మృతి మిస్టరీ‌పై సస్పెన్స్ వీడనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..