Andhra Pradesh: గొడవలకు దారితీసిన చంద్రబాబు వ్యాఖ్యలు.. ఆరు కేసులు నమోదు.. ఘటనపై జిల్లా ఎస్పీ క్లారిటీ
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల గొడవలు జరగడంతో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 4న మదనపల్లెలోని అంగళ్ళ సెంటర్లో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా జరిగిన గొడవపై నిన్నటి వరకు 6 కేసులు నమోదైనట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల గొడవలు జరగడంతో ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 4న మదనపల్లెలోని అంగళ్ళ సెంటర్లో ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా జరిగిన గొడవపై నిన్నటి వరకు 6 కేసులు నమోదైనట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని అంగళ్ళ వద్ద మొదట తీసుకున్న పర్మిషన్ రూట్లో కాకుండా అకస్మాత్తుగా చంద్రబాబు రూట్ మ్యాప్ ను పార్టీ వర్గాలు మార్చారని ఆరోపణలు వచ్చాయి. మొదట రెండు రూట్ మ్యాప్ లు ఇచ్చి వాటికి అనుమతి తీసుకొని చంద్రబాబు పర్యటన జరుగుతున్న రోజు ఆ సమయంలో అంగళ్ళ సర్కిల్ కు రాగానే ఊరి బయటనుంచి కాకుండా ఊరి లోపల నుంచి వెళ్లడంతో పక్కా ప్లాన్ ప్రకారం అల్లర్లు జరిగాయని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు అన్నారు .
మొదట చంద్రబాబు టూర్ జరుగుతున్న నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు అలానే అక్కడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న ఉమాపతి రెడ్డి.. చంద్రబాబుకు ప్రాజెక్టులకు సంబంధించిన మెమొరాండం ఇచ్చేందుకు వెళ్లగా చంద్రబాబు కావాలనే వారిని తోసేయండి ఇక్కడి నుంచి పంపేయండి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే గొడవ ప్రారంభమైందని పేర్కొన్నారు. అందులో భాగంగానే నిన్న సాయంత్రం ఏడు గంటలకు ఉమాపతి రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అన్నారు . ఏ 1 గా చంద్రబాబు, ఏ2 గా దేవినేని ఉమా , ఎ3 గా అమర్నాథ్ రెడ్డి తోపాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు.




అందులో భాగంగా దాదాపు 11 సెక్షన్లు కింద కేసు నమోదు అయిందని క్రిమినల్ యాక్టివిటీస్, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, స్థానిక ఎమ్మెల్యేను పరుష పదజాలంతో దూషించడం, గొడవ జరిగేందుకు ప్రేరేపించడం వంటి సెక్షన్లు అందులో ఉన్నాయని ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు . ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకోలేదని ఈ కేసుతో పాటు అంగళ్ళ దగ్గర జరిగిన గొడవకు సంబంధించి మరో 5 కేసులు నమోదయాయని మొత్తంగా ఆరు కేసులు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నమోదు చేశామని ఆయన అన్నారు . ప్రాథమిక విచారణ జరుపుతున్నామని కేసు పూర్వపరాలు జరిపిన తర్వాత పూర్తి వివరాలు అందజేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ గొడవలో సామాన్యులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయని పర్మిషన్ తీసుకున్న రూట్లో కాకుండా సడన్ గా వేరే రూట్ కు వచ్చి పక్కా స్కెచ్ తోనే ఇలా చేయడంతో అనేకమంది గాయాలపాలవ్వాల్సి వచ్చిందని ఎస్పీ స్పష్టం చేశారు.
