ఇదేం దొంగ బుద్ది.. టీమిండియాతో తలపడింది సీనియర్లే.. పాక్ అండర్ 19 జట్టుపై మాజీ పేసర్ సంచలన ఆరోపణలు..
Pakistan U19 Age Fraud: క్రికెట్‌లో పారదర్శకత ఉండాలని, కేవలం విజయాల కోసం వయస్సును తక్కువ చేసి చూపడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆసిఫ్ తన ఇంటర్వ్యూని ముగించారు. మరి ఈ ఆరోపణలపై పీసీబీ విచారణ జరుపుతుందో లేదో వేచి చూడాలి.

IND vs PAK: పాకిస్థాన్ క్రికెట్‌లో వివాదాలు కొత్తేమీ కాదు, కానీ తాజాగా ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. పాకిస్థాన్ అండర్-19 జట్టులో ఆడుతున్న ఆటగాళ్లందరూ తమ వయస్సును తక్కువ చేసి చూపుతున్నారని, వారు నిజానికి “టీనేజర్లు” కాదని ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు.
పాకిస్థాన్ జూనియర్ జట్టు ప్రదర్శనపై సమీక్ష చేస్తున్న క్రమంలో ఆసిఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ప్రస్తుతం అండర్-19 జట్టులో ఉన్న ఆటగాళ్ల ముఖాలు చూడండి. వారిని చూస్తే ఎవరికైనా వారు 19 ఏళ్ల లోపు వారని అనిపిస్తుందా? వారి అసలు వయస్సు 25 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుంది. కానీ కాగితాల్లో మాత్రం వారు 17-18 ఏళ్ల కుర్రాళ్లుగా చెలామణి అవుతున్నారు” అని ఆసిఫ్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ క్రికెట్‌కు ముప్పు..
ఈ వయస్సు మోసం వల్ల పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు నాశనమవుతోందని ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. “మీరు అండర్-19 స్థాయిలోనే వయస్సును దాచిపెట్టి ఆడితే, రేపు సీనియర్ జట్టులోకి వచ్చేసరికి వారు త్వరగా అలసిపోతారు. అందుకే పాక్ బౌలర్లు 27 ఏళ్లకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వారు అప్పటికే శారీరకంగా 35 ఏళ్ల వయస్సును దాటి ఉంటారు” అని ఆయన విశ్లేషించారు.
గతంలోనూ ఇలాంటి ఆరోపణలే..
View this post on Instagram
పాకిస్థాన్ క్రికెటర్ల వయస్సుపై అనుమానాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో షాహిద్ అఫ్రిది తన ఆత్మకథలో తన వయస్సు గురించి తప్పుడు వివరాలు ఉన్నాయని ఒప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే నసీమ్ షా వంటి ఆటగాళ్ల వయస్సుపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఒక మాజీ ఆటగాడే నేరుగా ప్రస్తుత జట్టును టార్గెట్ చేయడం పీసీబీని ఇరకాటంలో పడేసింది.
పీసీబీ మౌనం..
మహమ్మద్ ఆసిఫ్ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారికంగా స్పందించలేదు. జూనియర్ స్థాయిలో ఇలాంటి మోసాలు జరిగితే ఐసీసీ (ICC) కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
క్రికెట్‌లో పారదర్శకత ఉండాలని, కేవలం విజయాల కోసం వయస్సును తక్కువ చేసి చూపడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆసిఫ్ తన ఇంటర్వ్యూని ముగించారు. మరి ఈ ఆరోపణలపై పీసీబీ విచారణ జరుపుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




