Rs 1 Shoe Offer: రూ.1కే బూట్లు ఆఫర్.. కొనేందుకు షాపు ముందు ఎగబడ్డ జనాలు! ఎక్కడంటే..
కేవలం 1 రూపాయికే ప్రీమియం షూలు ఇస్తామని హామీ ఇస్తూ ఓ షూ కంపెనీ దుకాణం నిర్వహించిన ప్రచార కార్యక్రమం ఆదివారం ఉదయం భారీ రద్దీని రేకెత్తించింది. దీంతో జనాన్ని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. ప్రకటనలకు ఆకర్షితులైన వందలాది మంది కస్టమర్లు తెల్లవారుజామునే ఆ ప్రాంతాన్ని ముంచెత్తారు. దీనితో అక్కడ తొక్కిసలాట జరిగింది..

జత బ్రాండెడ్ బూట్లు కొనాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిందే. నాసిరకం అయితే రూ. వెయ్యిలోపు కొనేయొచ్చు. అయితే ఓ షూ కంపెనీ కేవలం రూ.1 కే బూట్లు ఇస్తామంటూ ప్రకటన వెలువరించింది. అంతే తెల్లారేసరికి షాపు ముందు విద్యార్ధులు, యువత వందలాదిగా వచ్చి లైన్లలో వేచి ఉన్నారు. సమయం గడిచే కొద్దీ షాపు ముందు జనాలు పెరగడంతో వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి దాపురించింది. చివరకు చేసేదిలేక పోలీసులు లాఠా ఛీర్జ్ చేసి జనాలను చెదరగొట్టారు. ఈ విచిత్ర ఘటన కేరళలోని కోళీకోడ్‌లో ఆదివారం (మార్చి 8) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కేరళలోని కోళీకోడ్‌లో ఓ షూ షాపు యజమాని వ్యాపార ప్రకటనలో భాగంగా రూపాయి నోటు చూపిన మొదటి 100 మందికి ప్రీమియం బూట్లు ఇస్తామంటూ ప్రకటించాడు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే జనాలు షాపుకి పోటెత్తారు. తెల్లారేసరికి షాపు ముందు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని నియంత్రించడం కష్టంగా మారింది. మరోవైపు ఆ ప్రాంతంలో జనాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో రంగంలోకి పోలీసులు దిగారు.
దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ గందరగోళానికి కారణమైన షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ట్రెండ్ కాల్డ్ ఫ్యాక్టరీ అనే షాపు ముందు ఈ సంఘటన జరిగింది. ఈ షాపును సందర్శించే కస్టమర్లు రూ.1కి బూట్లు కొనుగోలు చేయవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ప్రకటనతో వందలాది మంది కొనుగోలుదారులు షాపు ముందు బారులు తీరారు. వారిలో చాలామంది విద్యార్థులు, యువకులు తెల్లవారుజాము నుంచే షాపు ముందు పడిగాపులు కాశారు. జనాలు అంతకంత పెరగడంతో అక్కడ తోపులాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




