Andhra: అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం.. సూపర్ కదా..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో రూ.80 కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ పోస్టల్ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యాలయంతో రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ పరిపాలన మరింత సమర్థవంతం కానుంది. ..

రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80 కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ పోస్టల్ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల 15 జాతీయ బ్యాంక్‌లకు ఒకేసారి శంకుస్థాపన చేసిన నేపధ్యంలో అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర సంస్థలు వరుసగా ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన పరిపాలనా అనుమతులు కూడా మంజూరైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ సేవల నిర్వహణ, పర్యవేక్షణ మరింత సమర్థంగా జరిగేలా ఈ రీజినల్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఆధునిక ఐటీ సదుపాయాలు, డిజిటల్ సేవల సమన్వయం, అన్ని విభాగాలు ఒకే ప్రాంగణంలో పనిచేసే విధంగా భవనాన్ని రూపొందించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
పరిపాలనా పనులకు వేగం
ఈ కార్యాలయం అమరావతిలో ఏర్పాటవ్వడంతో పోస్టల్ పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఏర్పడనుంది. జిల్లాల మధ్య సమన్వయం మెరుగుపడి, సేవల నాణ్యత మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగాలు, ఆర్థిక కార్యకలాపాలు, పోస్టల్ రీజినల్ కార్యాలయ నిర్మాణంతో నిర్మాణ దశలోనే కాకుండా, పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కూడా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఇది మరో బలం
ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతికి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, పోస్టల్ రీజినల్ కార్యాలయానికి అనుమతి లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర కార్యాలయాల ఏర్పాటు ద్వారా అమరావతి దేశంలోనే ఒక కీలక పరిపాలనా కేంద్రంగా ఎదుగుతుందన్న నమ్మకం స్టేక్ హోల్డర్స్‌లో బలపడుతోంది.
దీనికి తోడు పోస్టల్ శాఖ మన రాష్టానికి, ఇంకా అమరావతి ప్రాంతానికే చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలోనే ఉండడం కూడా ఇంత వేగంగా పరిపాలనా అనుమతులు జారీ కావడానికి ఉతమివ్వడమే కాకుండా త్వరలోనే నిర్మాణం ప్రారంభం అయి కార్యకలాపాల ప్రారంభానికి సైతం వేగం పుంజుకోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
