Pawan Kalyan: వారాహి యాత్ర పై వీడని సందిగ్ధత.. నియోజకవర్గాలవారీగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి టూర్ పై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఆగస్ట్ మొదటివారంలో మూడో విడత యాత్ర ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. అయితే మరికొన్ని రోజులపాటు యాత్ర వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రెండు విడతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి టూర్ పై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఆగస్ట్ మొదటివారంలో మూడో విడత యాత్ర ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. అయితే మరికొన్ని రోజులపాటు యాత్ర వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రెండు విడతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కళ్యాణ్. మొదటి విడతలో 10 నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్.. స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం ద్వారా అక్కడ ఉన్న సమస్యలను గుర్తించారు. రెండో విడతలో ఐదు నియోజకవర్గాలలో పవన్ పర్యటన కొనసాగింది. బ్రో సినిమా రిలీజ్ ఉండటంతో వారాహి యాత్రకు కాస్త విరామం ఇచ్చారు జనసేన చీఫ్. ఆగస్ట్ మొదటి వారంలో మళ్లీ గోదావరి జిల్లాల్లో పర్యటన ఉంటుందని అనుకున్నా…ఇప్పట్లో టూర్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఒకవేళ ఆగస్ట్ 15 కు ముందు మూడో విడత జరపాలని అనుకుంటే అది గోదావరి జిల్లాలకు బదులు ఉత్తరాంధ్రలో ఉంటుందని జనసేన వర్గాలు చెప్తున్నాయి.
నియోజకవర్గాలవారీగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ రిలీజ్ తర్వాత మూడు రోజులకే హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చేసారు పవన్ కళ్యాణ్. పార్టీని మరింత బలోపేతం చేయడం, నియోజకవర్గాల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు,ముఖ్య కార్యకర్తలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి అవగాహనకు రావడంతో పాటు అక్కడ గెలుపు సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. ముందుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు,విశాఖ,గుంటూరు జిల్లాలకు చెందిన నియోజకవర్గాల నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. మరో వారం రోజుల్లో మరిన్ని నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ముఖ్యమైన పని ఉంటే తప్ప హైదరాబాద్కు వెళ్ళేదు : పవన్ ఒకప్పుడు హైదరాబాద్లో ఎక్కువ కాలం గడుపుతూ అప్పుడప్పుడు మాత్రమే ఏపీకి వచ్చేవారు పవన్. దీనిపై అధికార పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ వారాహి టూర్ ప్రారంభం అయిన తర్వాత మంగళగిరిలోనే ఉంటున్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఆఫీస్లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది మకాం కూడా మంగళగిరి కి మార్చేశారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప హైదరాబాద్ వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పూర్తి స్థాయిలో ఏపీనుంచే రాజకీయం చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్తున్న జనసేన అధినేత రాబోయే రోజుల్లో మరింత వేగం పెంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.