Andhra: ఏపీలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24,000 బోర్లు.. వేయిస్తున్నది ఎవరంటే..
గుంటూరు జిల్లా పొనుగుపాడు కాల్వ ప్రాంతంలో ఒఎన్జిసి 24,000 బోర్లు వేస్తోంది. చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం శాటిలైట్ నివేదికల ఆధారంగా సర్వే చేపట్టారు. మట్టి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపుతున్నారు. ఒక్కో బోరుకు వేసేవాళ్లకు రూ.5600 చెల్లిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.13 కోట్లుగా సమాచారం.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు కాల్వ ప్రాంతంలో పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నారు. ఒక్కో బోరు 80 అడుగుల మేర వేస్తున్నారు. రైతుల అనుమతి తీసుకొని బోర్లు వేయడంతో ఎందుకు వేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఒంగోలు నుండి విజయవాడ వరకూ ఈ బోర్లు వేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 24,000 బోర్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ బోర్ల కథ ఏంటా అన్న చర్చ నడుస్తోంది.
అయితే ఈ బోర్లను ఓఎన్జిసి వేస్తున్నట్లు తెలిసింది. ఆయిల్, సహజ వాయువు నిక్షేపాల కోసం ఈ బోర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. శాటిలైట్ నివేదికల ఆధారంగా ఓఎన్జిసి సర్వే చేపట్టింది. ఇందులో భాగంగానే ఒంగోలు నుండి కృష్ణా నది తీరం వరకూ అంటే విజయవాడ వరకూ చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం అన్వేషిస్తున్నారు. బోర్లు వేసి అక్కడ మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపుతున్నారు. ఒంగోలు నుండి విజయవాడ వరకూ 24000 బోర్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ పద్నాలుగు వేల బోర్లు వేశారు. రానున్న రెండు నెలల కాలంలో మరో పది వేల బోర్లు వేయనున్నారు. దీంతో ఈ బోర్లు ఎందుకు వేస్తున్నారా అని రైతులు చర్చించుకుంటున్నారు.
ఒక్కో బోరుకు ఓఎన్జిసి 5600 రూపాయలను చెల్లిస్తుంది. మొత్తం బోర్లు వేయడానికే పదమూడు కోట్లు రూపాయలను వెచ్చిస్తుంది. దీంతో సహజ వాయువు ఉందేమోనని రైతులు కూడా భావిస్తున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల్లోనూ సర్వే చేసి పెద్ద ఎత్తున బోగ్గు నిల్వలు ఉన్నట్లు తేల్చారు. యురేనియం నిల్వల కోసం మాచర్ల పరిసర ప్రాంతాల్లో గత రెండేళ్ల క్రితం ఇదే విధంగా బోర్లు వేశారు. వీటి తరహాలో సర్వే జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.