AP News: సౌత్ ఇండియాలో ప్రధాన ఆర్థిక నగరం మన ఏపీలోనే.. నీతీ అయోగ్ గుర్తింపు..
విశాఖ ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతోంది. విశ్వ నగరాల సరసన చేరేందుకు అనువైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న విశాఖ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మెగా సిటీగా పేరొందింది. అలాగే దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల జాబితాలో మొదటి 9 స్థానాల్లో నిలిచింది. తాజాగా మరో కీలక దశకు చేరుకునేందుకు అవకాశాన్ని దక్కించుకుంది.

విశాఖ ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతోంది. విశ్వ నగరాల సరసన చేరేందుకు అనువైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న విశాఖ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక మెగా సిటీగా పేరొందింది. అలాగే దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల జాబితాలో మొదటి 9 స్థానాల్లో నిలిచింది. తాజాగా మరో కీలక దశకు చేరుకునేందుకు అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా నీతి అయోగ్ భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే కీలక నగరాల్లో విశాఖపట్నం కీలకపాత్ర పోషించనుందని ప్రకటించింది. వికసిత్ భారత్-2047 కింద దేశీయ ఆర్థికవ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 2,500 లక్షల కోట్లుకి చేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విజన్ తో ముందుకెళుతున్న విషయం విదితమే. ఇదే అంశాన్ని నిరంతరం కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతూ వస్తోంది.
2047 నాటికి దేశం లో నాలుగో బలమైన ఆర్థిక నగరంగా విశాఖ..
2047 నాటికి భారత ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ ఒక డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. ఈ నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో బి.వి.ఆర్.సుబ్రమణ్యం తాజాగా ప్రకటించారు. వీటితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎకనామిక్ హబ్స్‌గా కీలక పాత్ర పోషించే మరో 20 నుంచి 25 పట్టణాలను గుర్తించే పనిలో నీతి ఆయోగ్ ప్రస్తుతం ఉన్నట్లు కూడా సీఈవో తెలిపారు.
ముంబై, సూరత్, వారణాసిల తర్వాత..
ప్రణాళిక శాఖా ఇప్పటివరకు పట్టణాల ఆర్థిక ప్రణాళికలు కాకుండా కేవలం పట్టణ అభివృద్ధి ప్రణాళికలకు పరిమితమవడం సాధారణంగా జరుగుతున్న ప్రక్రియగా మారిందన్న సీఈవో ఇప్పుడు వ్యూహాన్ని మారిస్తున్నట్టు వివరించారు. ముంబై, సూరత్, వారణాసిల తర్వాత విశాఖపట్నంను ఆర్థిక చోదకశక్తులుగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.
తమ అభిప్రాయాలను పంచుకున్న 10 లక్షల మంది యువత
వికసిత్ భారత్- 2047 లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా దేశ యువతను కోరింది. అందులో భాగంగా ఇప్పటివరకు 10 లక్షలకుపైగా వివరణాత్మకమైన సూచనలు, సలహాలు వచ్చాయని.. వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తామని నీతి అయోగ్ సీఈవో తెలిపారు. తుది విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్-2047 ను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నట్లు చెప్పారు.
ఐటీ పరిశ్రమకు విశాఖ అనుకూలమని గతంలోనే గుర్తించిన నాస్కామ్- డెలాయిట్
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు విశాఖ అనువైన ప్రాంతమని నాస్కామ్-డెలాయిట్‌లు గతంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్క్ వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుని ఆ నివేదిక రూపొందించినట్టు అప్పట్లో డెలాయిట్ తెలిపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రత్యేక హనీ బీచ్ ఐటీ పేరుతో ఐటీ ఇండస్ట్రీని అభివృద్ది చేసే పనిలో ఉంది. ఆ దిశగా ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా, మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
విశాఖకు అంతర్జాతీయ బ్రాండింగ్
సిటీ ఆఫ్ డెస్టినీగా ముద్ర పడ్డ విశాఖ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు, అంతర్జాతీయంగా విశాఖ బ్రాండింగ్‌ను పెంచే విధంగా ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. జీ20 సమావేశాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, అంతర్జాతీయ వైద్యసదస్సు, మారిటైమ్ సదస్సు నుంచి తాజాగా నెషనల్ స్కిల్ కాంక్లేవ్ వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించడం ద్వారా విశాఖ గ్లోబల్ బ్రాండింగ్ దిశగా పయనిస్తోంది. దీంతో మరిన్ని పెట్టుబడుల ఆకర్షణకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు మార్గం ఏర్పడింది.
మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




