New Year 2023: న్యూ ఇయర్ వేడుకలపై ఏపీ పోలీసులు ఆంక్షలు.. హద్దుమీరితే విద్యార్థుల లిస్ట్ కాలేజీకి పంపుతామని హెచ్చరిక
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ యువత చేసే వేడుకలకు అడ్డుకట్ట వేశారు పోలీసు అధికారులు. డిసెంబర్ 31 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు.
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. నూతన సంవత్సరం 2023కి తమదైన శైలిలో స్వాగతం పలకడానికి ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో యువతి జోరుకి కళ్లెం వేయడానికి .. అధికారులు రెడీ అవుతున్నారు. అనేక నగరాల్లో ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, విజయవాడ సహా అనేక ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలను విధించారు.
కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ యువత చేసే వేడుకలకు అడ్డుకట్ట వేశారు పోలీసు అధికారులు. డిసెంబర్ 31 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. అంతేకాదు నగరంలోని ప్రధాన కూడళ్లలో బ్రీత్ అనలైజెర్ టెస్ట్ లు నిర్వహించనున్నామని చెప్పారు. విద్యార్థులు మందు తాగి పట్టుబడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తామని ముందుగానే హెచ్చరించారు. అంతేకాదు సదరు కాలేజ్ యాజమాన్యాలకు మందు తాగిన విద్యార్థుల లిస్ట్ పంపుతామని తెలిపారు. తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ రేపు సాయంత్రం నుంచి మూసివేయనున్నామని.. వాహనదారులు ఇది గమనించాలని కోరారు. ఎవరైనా సరే న్యూ ఇయర్ అంటూ బైక్ , కార్ రేసింగ్ లకు పాల్పడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టనున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు తిరుమలలో ప్రభుత్వ నిబంధనల మేరకు వైన్ షాప్స్, బార్ లు మూసివేయాలని తెలిపారు ఎస్పీ పరమేశ్వర రెడ్డి.
మరోవైపు విజయవాడలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురికి మించి జనం గుమిగూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. రోడ్లపై కేక్ కట్ చేయడానికి వీలులేదని.. రోడ్లపై భారీ శబ్ధాలతో డీజేలు, బైక్స్, కార్లతో హంగామా చేయడానికి వీలులేదని పేర్కొన్నారు. బార్ అండ్ రెస్టారెంట్స్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..