AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: తిరుమల వెంకన్న స్వామి దర్శనాన్ని 6 నెలలు నిలిపివేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ

సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఫేక్ వార్తలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుమల వెంకన్న ఆలయాన్ని 6 నెలలు మూసివేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Fact Check: తిరుమల వెంకన్న స్వామి దర్శనాన్ని 6 నెలలు నిలిపివేస్తున్నారా..? ఇదిగో క్లారిటీ
Tirumala Balaji
Ram Naramaneni
|

Updated on: Dec 30, 2022 | 5:15 PM

Share

శ్రీవారి ఆలయంలో మార్చి నుండి 6 నెలలపాటు స్వామివారి దర్శనం నిలుపుదల ప్రచారం అవాస్తమని.. టీటీడీ తెలిపింది.  భక్తులు ఇలాంటి వదంతులు నమ్మవద్దని  విజ్ఞప్తి చేసింది.  యధావిధిగా మూలమూర్తి దర్శనం ఉంటుందని శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు.  తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం స్వామివారి దర్శనాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తారని కొన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. టీటీడీ ఆగమ సలహామండలి సూచనల మేరకు తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులు ప్రారంభించి 6 నెలల్లో పూర్తి చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు బాలాలయం ఏర్పాటుకు ఆలయ అర్చకులు 2023, మార్చి1న తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. ముందుగా వారం రోజులపాటు బాలాలయ నిర్మాణానికి అవసరమైన వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తి జీవకళలను కుంభంలోకి ఆవాహన చేసి బాలాలయంలో ఏర్పాటు చేసే దారు(కొయ్య) శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతారు.

ఇందుకోసం పట్టే ఆరు నెలల సమయంలో గర్భాలయంలోని మూలమూర్తిని భక్తులు యధావిధిగా దర్శించుకోవచ్చు. బాలాలయంలోని దారు విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. గర్భాలయంలో మూలమూర్తికి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తికి, బాలాలయంలోని దారు విగ్రహానికి ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలన్నీ యధావిధిగా జరుగుతాయి. 1957-58వ సంవత్సరంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం జరిగిన సందర్భంలో, 2018వ సంవత్సరంలో శ్రీవారి ఆలయంలో బాలాలయం నిర్వహించిన సందర్భంలో ఉన్న రికార్డుల ప్రకారం భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలు నిర్వహించడం జరిగింది.

వాస్తవం ఇలా ఉండగా, కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో 6 నెలల పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం ఉండదని జరుగుతున్న దుష్ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి