AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీఫ్ విప్ ఇస్తానన్నా మంత్రి పదవే కావాలంటున్న నేత.. డిప్యూటీ స్పీకర్ ఆయనకేనా..?

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం అంతే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు నామినేటెడ్ పదవుల కోసం జోరుగా లాబీయింగ్ సాగుతుంటే, మరో వైపు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ లాంటి కీలక పదవుల కోసం అంతకుమించి పోటీ నెలకొంది.

చీఫ్ విప్ ఇస్తానన్నా మంత్రి పదవే కావాలంటున్న నేత..  డిప్యూటీ స్పీకర్ ఆయనకేనా..?
Tdp
Eswar Chennupalli
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 30, 2024 | 5:23 PM

Share

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం అంతే భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు నామినేటెడ్ పదవుల కోసం జోరుగా లాబీయింగ్ సాగుతుంటే, మరో వైపు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ లాంటి కీలక పదవుల కోసం అంతకుమించి పోటీ నెలకొంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డవారు ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక పదవులను ఆశిస్తూ తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రి పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డ కొందరు ఈ పదవులతో కనీసం కేబినెట్ హోదా అశిస్తున్నారు. మరికొంతమంది మాత్రం మాకు మంత్రి పదవే తప్ప ఇలాంటివి ఆఫర్ చేయొద్దని, అవకాశం ఉన్నప్పుడు మంత్రి పదవే ఇవ్వండంటూ పట్టుబడుతున్నారు. భవిష్యత్ లో పునర్వ్యవస్థీకరణ జరిగితే తమకు ప్రాధాన్యత దక్కే లా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

అంచనాలకు మించిన మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం, అందులోనూ టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలు కావడంతో పదవులపై భారీ ఆశలు పెరిగాయి. దాదాపు 135 మందిలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన కొందరు తప్ప 100 మంది వరకు మంత్రి పదవులు ఆశించారు. కానీ కేవలం 25 మందికి మాత్రమే అవకాశం ఉండటం, అందులోనూ 4 పోస్టులు జనసేనా, బీజేపీలకు ఇవ్వాల్సి రావడంతో మిగతా వాళ్ళందరూ ప్రత్యమ్యాలపై దృష్టి సారించారు. కొందరు మాత్రం ఇప్పుడు కాకపోయినా మళ్లీ అవకాశం ఎప్పుడొచ్చినా మంత్రి పదవే కావాలని గట్టిగా ఆశలు పెట్టుకుంటున్నారు. చాలామంది మాత్రం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. వాటిలో ప్రధానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి కేబినెట్ ప్రోటోకాల్ తో ఉండే విప్ లాంటి పోస్టులు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారట.

అందులో ముఖ్యంగా మాజీ ఎంపీగా, మాజీ మంత్రిగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులు ప్రస్తుత పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని కోరుతున్నారట. అయితే స్పీకర్ టీడీపీకి ఇచ్చారు. కాబట్టి డిప్యూటీ స్పీకర్ జనసేనా, లేదంటే బీజేపీ కి ఇవ్వాలన్న డిమాండ్, ప్రతిపాదన ఉంది. అదే సమయంలో కీలకమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపై కూటమి పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. జన సేన, బీజేపీలలో సీనియర్ ఎమ్మెల్యేలు లేరు. కాబట్టి టీడీపీ కే ఆపదవులను వదిలేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. మూడు పార్టీల మధ్య ప్రస్తుతం అద్భుతమైన సమన్వయం ఉండడంతో టీడీపీ లోని సీనియర్లు పదవులు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవేళ టీడీపీకి అవకాశం వస్తే అనంతపురం జిల్లాకు చెందిన బోయ సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తూ ఉన్నారట. ఆయనకు చీఫ్ విప్ ఆఫర్ చేసినా దాని కంటే డిప్యూటీ స్పీకర్ కావాలని కోరుతున్నారట. ఎంపీ, చీఫ్ విప్, మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా కాలువ శ్రీనివాస్ మెన్షన్ చేస్తున్నారట. అయితే టీడీపీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇక చీఫ్ విప్‌గా ఆముదాలవలస ఎమ్మెల్యే, కళింగ సామాజికవర్గానికి చెందిన కూన రవికుమార్‌ పేరు పరిశీలనలో ఉందట. ఆయనకు గతంలో విప్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై 16 కేసులు నమోదు కాగా, జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. అయితే కూన మంత్రి పది ఆశించారు. శ్రీకాకుళం జిల్లాలో వెలమ, కళింగ సామాజిక వర్గాల మధ్య సామాజిక ఆధిపత్య పోరు ఉంటుంది. అక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి, ఆయన బాబాయ్ అచ్చనాయుడుకుకి రాష్ట్ర మంత్రి పదవి లభించడం.. కళింగ సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో అక్కడ సమన్వయం తప్పిందట.

ఈ నేపథ్యంలో దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించింది. అందుకే కూన రవికి చీఫ్ విప్ పదవిని ఆఫర్ చేసే పనిలో పార్టీ ఉందట. కానీ కూన రవికుమార్ ఆలోచన మరోలా ఉందట. తనకి ఇస్తే మంత్రి పదవి తప్ప మరో పదవీ వద్దన్న ధోరణిలో కూన ఉన్నారట. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మంత్రి పదవే ప్రత్యామ్నాయం కానీ లేదంటే తమ సామాజిక వర్గం సహకరించదన్న సంకేతాలను కూడా ఇస్తున్నారట. ఒకవేళ కూన తనకు చీఫ్ వద్దని గట్టిగా చెబితే, పరిశీలనలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తో పాటు పలువురు ఉన్నారట. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డ వారి పేర్లన్నీ పరిశీలనలో ఉన్నాయట. పొన్నూరు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, బుచ్చయ్య చౌదరి, గణ బాబు లాంటి నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయట.

అలాగే విప్‌ల కోసం కూడా పలువురి పేర్లను పరిశీలిస్తోంది టీడీపీ. గత ప్రభుత్వ హయాంలో 9 మంది విప్‌లను నియమించారు. అయితే విప్‌ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. కూటమి పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి సంఖ్య 14 కు పెంచాలన్న ఆలోచన కూడా ఉందట. రెండు విప్‌లు జనసేనకు, ఒకటి బీజేపీకి కూడా ఆఫర్ చేశారట. తమకు రెండు విప్ పదవులు కావాలని జనసేన ఈపాటికే సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాసింది. మంత్రి పదవులపై ఆశ పెట్టుకుని నిరాశ చెందిన వారితోపాటు, కుల సమీకరణలో స్థానం లభించని వారికి విప్‌లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చీఫ్ విప్ కేబినెట్ హోదా కాగా, విప్‌లకు గతంలో కేంద్ర సహాయమంత్రి హోదా ఉండేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల నుంచి, అందరికీ కేబినెట్ హోదానే లభిస్తోంది. విప్‌లకు ఒక ఎస్కార్టు, ఒక పీఎస్, ఇద్దరు పీఏలను నియమించుకునే అధికారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కొంతమందిని తృప్తి పరిచే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..