AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: దృశ్యం సినిమాను మించి.. మహిళను చంపి పూడ్చిపెట్టాడు.. ఆమె ఫోన్‌‌తో భర్తకు వాట్సప్ మెసేజ్.. కట్ చేస్తే..

టెక్నాలజీ ముందు నేరగాళ్లు ఎంతటి హైడ్రామా ఆడినా దొరికిపోవాల్సిందే. ఒక మహిళ మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన ఏలూరు త్రీ టౌన్ పోలీసులు.. ఆ మిస్టరీ వెనుక ఉన్న అక్రమ సంబంధం, అనుమానం, దారుణ హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు. చంపేసి శవాన్ని పూడ్చిపెట్టి, ఆపై ఆమె బతికే ఉందంటూ నిందితుడు ఆడిన వాట్సాప్ చాటింగ్ నాటకాలకు ఖాకీలు ఎలా ఎండ్ కార్డ్ వేశారో తెలుసుకుందాం..

Andhra Pradesh: దృశ్యం సినిమాను మించి.. మహిళను చంపి పూడ్చిపెట్టాడు.. ఆమె ఫోన్‌‌తో భర్తకు వాట్సప్ మెసేజ్.. కట్ చేస్తే..
Twist In Eluru Missing Woman Case
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 30, 2026 | 8:39 AM

Share

పోలీసుల చాకచక్యం, టెక్నాలజీ ముందు నేరగాళ్ల నాటకాలు సాగవని ఏలూరు పోలీసులు మరోసారి నిరూపించారు. ఒక మహిళ మిస్సింగ్ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, దాని వెనుక దాగున్న అత్యంత కిరాతకమైన హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు. వివాహేతర సంబంధంలో తలెత్తిన అనుమానాలు, ఆర్థిక లావాదేవీల వివాదమే ఈ ఘోర హత్యకు దారితీసింది. నమ్మించి ప్రాణాలు తీయడమే కాకుండా శవాన్ని పూడ్చిపెట్టి, సదరు మహిళ బతికే ఉందంటూ నాటకాలాడిన నిందితుడి గుట్టును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరిపురం గ్రామానికి చెందిన మల్లవల్లి విశాలి (36) అనే వివాహిత ఏప్రిల్ 18న గుడివాడలోని తన బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇల్లు వదిలి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళన చెందిన భర్త పోలీసులను ఆశ్రయించాడు.

భర్త ఫిర్యాదుతో పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న త్రీ టౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబుల టీమ్ ఆధునిక టెక్నాలజీని వినియోగించింది. మృతురాలి మొబైల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా, సౌరిపురం గ్రామానికి చెందిన దర్శన్ ఫ్రాన్సిస్ శౌరి (36) అనే పాల వ్యాపారితో ఆమె నిరంతరం సంభాషించినట్లు ఆధారాలు లభించాయి. ఇదే సమయంలో ఫ్రాన్సిస్ కూడా కనిపించకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసింది.

అక్రమ సంబంధం.. అనుమానమే ప్రాణాంతకం

పోలీసుల విచారణలో నిందితుడు ఫ్రాన్సిస్, మృతురాలి కుటుంబానికి రెండు లక్షల రూపాయల అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేసేవాడని తేలింది. ఈ ఆర్థిక లావాదేవీల క్రమంలోనే విశాలితో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే విశాలి తనతోనే కాకుండా ఇతరులతో కూడా ఫోన్లలో మాట్లాడుతోందని ఫ్రాన్సిస్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని, అత్యంత క్రూరంగా అంతమొందించాలని పథకం పన్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఏప్రిల్ 18న డబ్బులు ఇస్తానని నమ్మించి విశాలిని హనుమాన్ జంక్షన్ వద్దకు పిలిపించాడు. అక్కడి నుండి ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని నూజివీడు మండలం పల్లెర్లమూడి సమీపంలో గల పోలవరం కాలువ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె చనిపోయిందని నిర్ధారించుకోవడానికి ఒక పెద్ద రాయిని తీసుకుని ఛాతిపై బలంగా కొట్టి, ప్రాణాలు తీసి శవాన్ని అక్కడి పొదల్లో పడేసి పరారయ్యాడు.

శవాన్ని పూడ్చిపెట్టి.. చాటింగ్‌లతో హైడ్రామా

హత్య చేసిన 5రోజుల తర్వాత ఏప్రిల్ 23న నిందితుడు మళ్లీ ఘటనా స్థలానికి వెళ్లాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడ లోతుగా గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఆమె బట్టలు, ఇతర వస్తువులను కాల్చేసి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. అంతేకాదు పోలీసులు, కుటుంబ సభ్యుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు హైడ్రామాకు తెరతీశాడు. విశాలి బతికే ఉందనే భ్రమ కల్పించడానికి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, ఆమె ఫోన్ నుండి భర్తకు వాట్సాప్ చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేవాడు. చివరికి పోలీసులకు దొరికిపోతాననే భయంతో ఆ ఫోన్‌ను పగలగొట్టి చెరువులో పడేశాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన ఏలూరు త్రీ టౌన్ పోలీసులు, హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఫ్రాన్సిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల శైలిలో విచారించడంతో అతడు చేసిన ఘోర నేరాన్ని పూర్తిగా అంగీకరించాడు. విశాలి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు. మృతురాలి బంధువుల అదనపు స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, పక్కా సాక్ష్యాధారాలతో నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Follow Us