TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు
తిరుమలలో సర్వదర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులకు టీటీడీ కొత్త రీ-ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా భక్తులు క్యూలైన్ నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుని, నిర్ణీత సమయంలో తిరిగి దర్శనానికి హాజరుకావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుంది. సగటున రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ విపరీతమైన రద్దీ కారణంగా సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం కొన్ని సందర్భాల్లో ఏకంగా 24 గంటలకు పైగా పడుతోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు రోజంతా క్యూలైన్లు, ఇరుకైన కంపార్ట్‌మెంట్లలో బంధీగా ఉండటం అత్యంత కష్టసాధ్యమైన విషయం. ఈ నేపధ్యంలో భక్తుల కష్టాలను, వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. అదే.. క్యూలైన్ల నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లి, తిరిగి వచ్చే ‘రీ ఎంట్రీ’ విధానం. భక్తులకు ఎంతో ఉపశమనం కలిగించే ఈ కొత్త వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది? దీని నియమ నిబంధనలు ఏంటి? అనే పూర్తి వివరాలను ఈ ఎక్స్‌ప్లైనర్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత భక్తులు స్వామివారి దర్శనం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ, ఈ నూతన విధానం ద్వారా భక్తులు తమ దర్శన సమయానికి కొన్ని గంటల ముందు క్యూలైన్ నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్ళవచ్చు. ముఖ్యంగా పసిపిల్లలతో వచ్చే తల్లులు, గంటల తరబడి నిలబడలేని వృద్ధులు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి.. తమ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేసి మందులు అవీ వేసుకోవడం వీలవుతుంది. అయితే.. ఇలా క్యూ కాంప్లెక్స్‌లో నుంచి బయటకు వెళ్లాలనుకునే భక్తులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా.. రీ ఎంట్రీ కోరుకునే భక్తులు ముందుగా వైకుంఠం-2 కాంప్లెక్స్‌లో తమ ‘ఆధార్ కార్డు’ను సమర్పించాలి. ఆధార్ వివరాలను పరిశీలించిన తర్వాత టీటీడీ సిబ్బంది భక్తులకు ఒక ప్రత్యేకమైన రీ ఎంట్రీ టోకెన్‌ను జారీ చేస్తారు. టోకెన్ తీసుకున్న తర్వాత భక్తులు క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్‌మెంట్ వద్దకు చేరుకోవాలి. అక్కడ ఉన్న ప్రత్యేక రీ ఎంట్రీ సెంటర్ వద్ద ఈ టోకెన్‌ను స్కాన్ చేయించుకుని, ఎగ్జిట్ పాయింట్ ద్వారా బయటకు రావచ్చు. క్యూలైన్ల నుంచి బయటకు వచ్చిన ప్రయాణికుల టోకెన్‌పై మీ దర్శన సమయాన్నిస్పష్టంగా పేర్కొంటారు. ఆ సమయానికి లోపు భక్తులు.. తమకు కేటాయించిన గదులు లేదా కాటేజీలకు వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. పసిపిల్లలకు కావాల్సిన పాలు, ఆహారాన్ని ప్రశాంతంగా తినిపించవచ్చు. తిరుమలలోని ఇతర దర్శనీయ ప్రదేశాలు, మ్యూజియంలను సందర్శించవచ్చు. అలాగే, తాత్కాలిక విరామం తర్వాత భక్తులు తిరిగి స్వామివారి దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించడానికి ఒక పద్ధతిని నిర్దేశించారు. భక్తులు తమ టోకెన్‌పై కేటాయించిన సమయానికి కనీసం 15 నుండి 20 నిమిషాల ముందే తిరిగి నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవాలి. తిరుమల మ్యూజియం దగ్గర ఉన్న డబ్ల్యూ-4 గేట్ ద్వారా లోపలికి ప్రవేశించాలి. అక్కడ ఉన్న రీ-ఎంట్రీ సెంటర్ వద్ద మీ టోకెన్‌ను పునఃపరిశీలించి లోపలికి పంపుతారు. ఈ గేట్ ద్వారా వెళ్లిన భక్తులకు కేవలం 2 నుండి 4 గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం అత్యంత సులభంగా పూర్తవుతుంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా స్వామివారి దర్శనానికి ఇబ్బంది కలగవచ్చు. క్యూలైన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇచ్చే టోకెన్‌ను భక్తులు జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకవేళ పొరపాటున ఈ టోకెన్ పోగొట్టుకుంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి లోపలికి అనుమతించరు. రీ ఎంట్రీ అయ్యే భక్తుల కోసం మ్యూజియం గేట్ వద్ద లగేజ్ లేదా మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేయడానికి ప్రత్యేక కౌంటర్లు లేవు. కాబట్టి, భక్తులు డబ్ల్యూ-4 గేట్ ద్వారా తిరిగి లోపలికి వెళ్లడానికి ముందే తమ సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తమ గదుల్లో లేదా ఇతర లగేజ్ కౌంటర్లలో భద్రపరుచుకుని రావాలి. నిర్దేశించిన దర్శన సమయానికి కనీసం 20 నిమిషాల ముందే గేటు వద్దకు చేరుకోవడం మంచిది. ఆలస్యమైతే స్లాట్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు ఒకటి రెండు రోజుల అక్కడ ఉంటుంటారు. అందులో 24 గంటల టైం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనే గడిచిపోవడం వలన తిరుమలలోని, కొండ కింది అనేక దివ్య క్షేత్రాలను చూడలేకపోతున్నారు. పైగా, అన్నేసి గంటలు స్వామి దర్శనం కోసం ఎదురుచూసే క్రమంలో వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు, మహిళలు శారీరక శ్రమకు లోనవుతున్నారు. తాజాగా టీటీడీ ప్రవేశపెట్టిన ఈ ‘రీ ఎంట్రీ’ విధానం ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. ఇది తిరుమల చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పుగానూ చెప్పవచ్చు. ఈ నియమ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకుని, సమయపాలన పాటిస్తే ఇక.. సర్వదర్శనం చేసుకునే శ్రీవారి భక్తులకూ అనాయాసంగా.. ఆ వేంకట రమణుడి దర్శనభాగ్యం కలగనుంది. దీనివల్ల సాధారణ భక్తుల తిరుమల యాత్ర అత్యంత సుఖమయం, భక్తిమయం అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం
Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా
అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..
భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం..
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

