‘జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి’.. లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్!
ఇప్పటి వరకు పాలనపై ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. మెయిన్‌గా పార్టీపైనా, లీడర్లపైనా దృష్టి పెట్టారు. కొందరు నేతల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. 'జమీందారీ పోకడలు పక్కన పెట్టండి.. జనంలోకి వెళ్లండి' అంటూ గట్టిగానే మాట్లాడారు. తనతో సహా ఎవరికీ మినహాయింపులు లేవంటూ కఠిన నిబంధనలు పెట్టారు. మరి పీఏసీ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఏంటి? ఎమ్మెల్యేలకు ఇచ్చిన టార్గెట్ ఏంటి?

కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం హాట్ హాట్‌గా సాగింది. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. అధికారంలోకి వచ్చామన్న గర్వంతో కొందరు నేతలు క్షేత్రస్థాయిని మర్చిపోతున్నారనే సంకేతాలు రావడంతో సీఎం అలర్ట్ అయ్యారు. ఇకపై కుర్చీల్లో కూర్చుంటే కుదరదు.. జనం మధ్యలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. నెలలో మూడు రోజుల పాటు తానే స్వయంగా స్వయంగా కార్యకర్తలకు సమయం కేటాయిస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇన్‌ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు కచ్చితంగా పార్టీ కోసమే పని చేయాలని ఆదేశించారు. మంత్రుల నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు.. ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు.
లీడర్లు గ్రౌండ్‌లో ఉంటేనే.. కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్‌గా ఉంటారనేది సీఎం రేవంత్ రెడ్డి భావన. పార్టీ కోసం కష్టపడిన పీసీసీ మాజీ అధ్యక్షులందరినీ కలుపుకొని వెళ్లాలని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. సొంత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు జమీందార్లుగా మారారని, సొంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జనం లోకి తీసుకెళ్లడం లేదంటూ ఫైర్ అయ్యారు.
అటు సోషల్ మీడియా వాడకంపై కూడా సీఎం క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాను కేవలం తమ భజన కోసమే వాడుకుంటున్నారని, పార్టీ ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే.. సోషల్ మీడియాను ఎలా వాడాలనే దానిపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పీసీసీని ఆదేశించారు. మొత్తం మీద పాలనతో పాటు పార్టీని కూడా గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూట్ మార్చకపోతే.. భవిష్యత్తు మారదు అనే గట్టి సిగ్నల్స్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
