Hyderabad: ఏఐతో మ్యాజిక్ చేసిన తల్లిదండ్రులు.. వీళ్ల టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రీకొడుకులు ఏఐతో మ్యాజిక్ చేశారు. వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే రోబోటిక్ ఆర్మ్ అభివృద్ది చేశారు. వీరి ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు. రోబోటిక్ ఆర్మ్‌కు 3D డిజైన్ రూపొందించారు. వీళ్లు దీనిని నెటిజన్లతో పంచుకోగా.. వైరల్‌గా మారింది. ఈ వివరాలు చూస్తే..

హోమ్‌వర్క్ నుంచి హైటెక్ వరకు.. AI ఉంటే ఐడియాలకు లిమిట్స్ లేవని హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రీకొడుకులు నిరూపించారు. స్కూల్ టెక్ ఫెయిర్ కోసం మొదలైన చిన్న ప్రాజెక్ట్.. చివరికి వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే రోబోటిక్ ఆర్మ్‌గా మారింది. ఈ జర్నీని తండ్రి సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకోగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథ మొదలైంది కొడుకు ఒక డ్రీమ్‌తో.. స్కూల్ టెక్ ఫెయిర్‌కు వారం ముందు ఇంటికి వచ్చి రోబోట్ తయారు చేద్దాం అని చెప్పాడు. కానీ అంత తక్కువ సమయంలో పూర్తి రోబోట్ సాధ్యం కాదని భావించిన తండ్రీకొడుకులు.. వాయిస్‌తో కదిలే రోబోటిక్ ఆర్మ్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
మొదట యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు చూసి ఐడియాలు సేకరించారు. తర్వాత ఏఐ అసిస్టెంట్ Claude సాయంతో రోబోటిక్ ఆర్మ్‌కు 3D డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్‌ను హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న 3D ప్రింటింగ్ సెంటర్‌లో ప్రింట్ చేయించారు. అక్కడి నుంచి వచ్చిన పార్ట్స్‌ను ర్యాపిడో ద్వారా ఇంటికి తెప్పించుకున్నారు. అక్కడితో పని అయిపోలేదు. ఎలక్ట్రానిక్ పార్ట్స్ కోసం కోటి మార్కెట్‌కు వెళ్లి మోటార్లు, మైక్రోకంట్రోలర్ చిప్స్, కెపాసిటర్లు, రెసిస్టర్లు, వైర్లు వంటి సామగ్రిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసలు టెక్ మ్యాజిక్ మొదలైంది. ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో AI అసిస్టెంట్ Claude కీలక పాత్ర పోషించింది. రోబోటిక్ ఆర్మ్ పనిచేయడానికి అవసరమైన కోడ్‌ను రాయడం, వచ్చిన టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలు సూచించడం, డిజైన్‌ను మరింత మెరుగుపరచడం వంటి ప్రతి దశలో AI తోడ్పడింది. ముఖ్యంగా Claudeలోని Opus 5, Fable మోడళ్లను ఉపయోగిస్తూ పలుమార్లు డిజైన్‌ను మెరుగుపరిచి, చివరకు వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే రోబోటిక్ ఆర్మ్‌ను విజయవంతంగా తయారు చేశారు.
ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు “AIని ఇలా నేర్చుకోవడానికి ఉపయోగిస్తేనే అసలు విలువ”, “ఫాదర్-సన్ గోల్స్ అంటే ఇదే”, “ఇలాంటి ప్రాజెక్టులు పిల్లల్లో క్రియేటివిటీని పెంచుతాయి” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక స్కూల్ అసైన్‌మెంట్‌తో మొదలైన ఈ ప్రయాణం.. AI, టెక్నాలజీ, తండ్రీకొడుకుల బాండింగ్ కలిసి ఎంత అద్భుతమైన ఫలితం ఇవ్వగలవో చూపించింది.
