పోలీస్ ఉద్యోగాలకు TSLPRB నుంచి మరో కొత్త నోటిఫికేషన్.. సెప్టెంబర్ 9 వరకే అవకాశం
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో స్టైపెండరీ క్యాడెట్ ట్రెయినీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్), పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) 2026 సంవత్సరానికి సంబంధించి పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో స్టైపెండరీ క్యాడెట్ ట్రెయినీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 27 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో SCT పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పురుషులు పోస్టులు 7, SCT పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పురుషులు పోస్టులు 20 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 19, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే ఆటో ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటర్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఫిట్టర్ ఐటీఐ ట్రేడుల్లో ఏదైనా ఒకదానిలో సర్టిఫికెట్ ఉండాలి. పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. దీనితోపాటు చెల్లుబాటు అయ్యే హెవీ ప్యాసింజర్ మోటర్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. హోంగార్డులకు వయో పరిమితిలో ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా కుల ధ్రువీకరణ పత్రం, ఎస్టీ అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అలాగే అభ్యర్థులు అందరూ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. పోలీస్ శాఖలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెకానిక్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ (డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది). వీటిల్లో మెరిట్ సాధించిన వారికి టెక్నికల్ రాత పరీక్ష 200 మార్కులు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
