నిరుద్యోగులకు అలర్ట్.. AIIMS భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎంపికైతే నెలకు రూ.85 వేల జీతం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్ (AIIMS)తో పాటు పలు జాతీయ వైద్య సంస్థల్లో 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి NORCET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా జరగనుంది..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు జాతీయ వైద్య సంస్థల్లో 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) ద్వారా నిర్వహించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 ప్రారంభ వేతనం లభించనుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.85,000కు పైగా జీతం అందే అవకాశం ఉంది. ఈ నియామకాల్లో సుమారు 80 శాతం పోస్టులు మహిళలకు, మిగిలిన 20 శాతం పోస్టులు పురుషులకు దక్కే అవకాశం ఉంది. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి కెరీర్ అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు.
బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. లేదా జీఎన్‌ఎం (General Nursing & Midwifery)తో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 13, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్ధులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.2,400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా జరుగుతుంది.
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం ఇలా..
స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం ప్రశ్నలు 100లకు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ ప్రశ్నలు 80, జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ ప్రశ్నలు 20 వరకు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాల వరకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున కోత విధిస్తారు. ఈ పరీక్ష కేవలం అర్హత కోసం మాత్రమే. తుది మెరిట్‌లో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
స్టేజ్-2: మెయిన్‌కు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో మొత్తం ప్రశ్నలు 160లకు 160 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్‌లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 13 ఆగస్టు 2026 (సాయంత్రం 5 గంటల వరకు)
- ప్రిలిమ్స్ (స్టేజ్-1) పరీక్ష తేదీ: 12 సెప్టెంబర్ 2026
- మెయిన్స్ (స్టేజ్-2) పరీక్ష తేదీ: 30 సెప్టెంబర్ 2026
ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
