AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Tomato Chutney Recipe: రెగ్యులర్ చట్నీలతో బోర్ కొట్టిందా? ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ ట్రై చేయండి!

ఇడ్లీ, దోసె, వడ, పడ్డుతో పాటు చట్నీ ఉంటేనే అల్పాహారం మరింత రుచిగా అనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ వేరుశెనగ లేదా కొబ్బరి చట్నీనే చేసుకోవడంతో కొన్నిసార్లు బోర్ కొట్టొచ్చు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఉల్లిపాయలు, టమాటాలతో సులభంగా తయారుచేసుకునే ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ మంచి మార్పుగా ఉంటుంది. కారం, పులుపు, ఉల్లిపాయల రుచి కలిసిన ఈ చట్నీ వేడి వేడి ఇడ్లీ, దోసెతో ఎంతో రుచిగా ఉంటుంది.

Onion Tomato Chutney Recipe: రెగ్యులర్ చట్నీలతో బోర్ కొట్టిందా? ఈ ఉల్లిపాయ టమాటా చట్నీ ట్రై చేయండి!
Onion Tomato Chutney Recipe
Bhavani
|

Updated on: Oct 02, 2026 | 7:02 PM

Share

ఈ చట్నీ తయారీకి పెద్దగా పదార్థాలు అవసరం లేదు. ఉల్లిపాయలు, టమాటాలు, ఎండు మిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులతో ముందుగా చట్నీని తయారు చేసి, చివర్లో వెల్లుల్లి, కరివేపాకు, పప్పులతో మంచి పోపు పెడితే రుచి మరింత పెరుగుతుంది. తక్కువ సమయంలో తయారయ్యే ఈ చట్నీని మీకు నచ్చిన స్థాయిలో కారం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

ఉల్లిపాయ టమాటా చట్నీకి కావలసిన పదార్థాలు

మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయలు – 6

మధ్యస్థ పరిమాణ టమాటాలు – 6

నూనె – 3–4 టీస్పూన్లు

ధనియాల పొడి – 4 టీస్పూన్లు

ఆవాలు – 1 టీస్పూన్

జీలకర్ర – 1 టీస్పూన్

మెంతులు – 1 టీస్పూన్

ఎండు మిరపకాయలు – 15 లేదా రుచికి తగినంత

అల్లం – 2 రెబ్బలు (ఐచ్ఛికం)

ఉప్పు – రుచికి తగినంత

ఉల్లిపాయ టమాటా చట్నీ తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలు, టమాటాలను శుభ్రంగా కడిగి మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి తక్కువ మంటపై కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేసి బాగా కలపాలి.

మిరపకాయలు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు సుమారు 3 నిమిషాలు వేయించాలి.

ఇప్పుడు టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బాణలిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి, ఆ తర్వాత మంట ఆపేయాలి.

ఉడికించిన ఉల్లిపాయ-టమాటా మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సర్ జార్‌లో వేసి మీకు నచ్చినంత మెత్తగా లేదా కొద్దిగా ముతకగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.

చట్నీకి పోపు పెట్టే విధానం

పోపు కోసం చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపపప్పు, శనగపప్పు వేసి వేయించాలి.

పప్పులు వేగిన తర్వాత కరివేపాకు, ఎండు మిరపకాయలు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపేయాలి.

తయారైన పోపును గ్రైండ్ చేసిన ఉల్లిపాయ టమాటా చట్నీలో వేసి బాగా కలపాలి. అంతే.. రుచికరమైన ఉల్లిపాయ టమాటా చట్నీ సిద్ధం. వేడి వేడి ఇడ్లీ, దోసె, వడ లేదా పడ్డుతో సర్వ్ చేసుకోవచ్చు.

Follow Us