AadarshaKutumbam: ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ ట్రైలర్ వచ్చేసింది.. వెంకీ, త్రివిక్రమ్ మరో హిట్ కొట్టేలా ఉన్నారే!
విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం ఈ పాటికే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయాల్సి ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ, మాలా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విడుదలైంది. గిలిగింతలు పెట్టే హాస్య సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్, ఆసక్తికరమైన డ్రామాతో ఈ సినిమా ఒక సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ కలిగిస్తోంది. త్రివిక్రమ్ రచన, దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్.. ఆయన బలమైన రచనను, విలక్షణమైన కథా శైలిని మరోసారి చూపిస్తోంది. కుటుంబ వినోదానికి యాక్షన్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ ఆసక్తిని పెంచుతోంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్‌లను చక్కగా మేళవించిన ట్రైలర్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతోందనే అంచనాలను పెంచుతోంది. విక్టరీ వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆయన చూపించిన ఎనర్జీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆయన నటనకు తోడు ఆసక్తికరమైన కథనం, వినోదభరిత సన్నివేశాలు ట్రైలర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు అదనపు బలాన్నిచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తీవ్రతను పెంచుతూ, కథలోని ఉత్కంఠను మరింతగా ఎలివేట్ చేసింది.
‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాద్ లోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. “మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ లో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అద్భుతమైన స్పందన చూసి ఆనందంగా ఉంది. కాలేజ్ లైఫ్ లో నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఈరోజులు మళ్ళీ రావు. మీరు కూడా మంచి మెమోరీస్ ఉండేలా చూసుకోండి. మీ కలను నిజం చేసుకోండి. కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్ తో బయటకు రావాలి. అక్టోబర్ 30న మా సినిమా విడుదలవుతోంది. మీ అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మీరు ఊహించిన పద్ధతిలో కాకుండా, వేరే డైరెక్షన్ లో ఉండే లాంటి అవకాశమున్న సినిమా ఇది. నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుండా వేరే వేరే అంశాలను కూడా డిస్కస్ చేయడం జరిగింది. క్రైమ్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ అలాంటివి ట్రై చేశాము. నాకు, వెంకటేష్ గారికి కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్. పని చేసేటప్పుడు ఈ సినిమా మా అందరికీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అక్టోబర్ 30వ తారీఖున థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్లకు, నటీనటులకు, ముఖ్యంగా వెంకటేష్ గారికి కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ చినబాబు గారికి థ్యాంక్స్ చెప్పుకోవడమంటే ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకోవడమే. ఆయన తరపున కూడా అందరికీ నేనే కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్ జాబ్ చేశాడు. దాదాపు 7-8 పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఉంటాయి. త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం అవన్నీ. థ్యాంక్యూ. నమస్కారం.” అన్నారు.
కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “ఇలా స్టూడెంట్స్ మధ్యలో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. మనకి లైఫ్ లో ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. కానీ, లైఫ్ ప్లాన్ మరోలా ఉంటుంది. మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే మా సినిమాలో కూడా నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే ఆసక్తి ఉంటుంది. ప్రతి సీన్ కి ఓ సర్ప్రైజ్ ఉంటుంది. మీరు మా సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాలో అవకాశమిచ్చి, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. వెంకటేష్ గారు లాంటి లెజెండ్ తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. నిర్మాత చినబాబు గారు ఒక పిల్లర్ లాగా మా అందరికీ ఎంతో సపోర్ట్ గా నిలిచారు. తమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మీ అందరి లాగే నేను కూడా అక్టోబర్ 30 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను.” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “ఆదర్శ కుటుంబం నాకు ప్రత్యేకమైన సినిమా. నా ఫేవరెట్ ఫిల్మ్ నువ్వు నాకు నచ్చావ్. ఎప్పుడు చూసినా ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాను. ఆ కాంబినేషన్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. కొందరు రాస్తే కొందరు మాట్లాడాలి, కొందరు యాక్ట్ చేయాలి అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ చూడాలనే కోరిక అరవింద సమేత సినిమాతో తీరిపోయింది. అలాగే త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారి కాంబో. త్రివిక్రమ్ గారు పెర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ఏం కావాలో ఆయనకు కరెక్ట్ గా తెలుసు. వెంకటేష్ గారి కోసం ఆయన అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇటీవల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాను. సినిమా ఫెంటాస్టిక్ గా ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. నిర్మాత చినబాబు గారు అరవింద సమేత నుంచి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది త్రివిక్రమ్ గారి ట్రేడ్ మార్క్ ఫిల్మ్. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.” అన్నారు. బాల నటుడు రాజ్ ప్రజ్వల్, యువినా కూడా ఈ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొని సినిమా ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు. తమదైన మాటలతో విద్యార్థులలో ఉత్సాహం నింపారు.
20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై ఆసక్తి నెలకొంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉన్న ఈ కలయిక.. మరోసారి నవ్వులు, భావోద్వేగాలు, యాక్షన్, ఉత్కంఠతో కూడిన పూర్తిస్థాయి వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అద్భుతమైన ట్రైలర్ తో ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో కూడిన పూర్తిస్థాయి వినోదం అందించబోతోందనే అంచనాలతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. దీపావళి వారాంతానికి ముందు అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ ట్రైలర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
