కన్నడ రాజకీయంలో ‘డీకే’ మార్క్ సోషల్ ఇంజనీరింగ్.. ‘టీమ్ DK’ ఎవరెవరికి ఏ పదవంటే?
కర్ణాటక పాలిటిక్స్‌లో ఇప్పుడు అందరి కళ్లూ 'టీమ్ DK' వైపే! సరికొత్త వ్యూహాలతో, పక్కా ప్లానింగ్‌తో కర్నాటక కొత్త మంత్రివర్గ కూర్పు సిద్ధమవుతోంది. కేవలం అధికారం పంపకమే కాదు.. రాబోయే రోజుల్లో అసమ్మతి అనే మాటే రాకుండా డీకే శివకుమార్ అండ్ టీమ్ మైండ్ గేమ్ ఆడుతోంది.

కర్ణాటక పాలిటిక్స్‌లో ఇప్పుడు అందరి కళ్లూ ‘టీమ్ DK’ వైపే! సరికొత్త వ్యూహాలతో, పక్కా ప్లానింగ్‌తో కర్నాటక కొత్త మంత్రివర్గ కూర్పు సిద్ధమవుతోంది. కేవలం అధికారం పంపకమే కాదు.. రాబోయే రోజుల్లో అసమ్మతి అనే మాటే రాకుండా డీకే శివకుమార్ అండ్ టీమ్ మైండ్ గేమ్ ఆడుతోంది. సోషల్ ఇంజనీరింగ్‌తో పాటు ఈసారి యువత, మహిళలకు బంపర్ ఆఫర్స్ ఇవ్వబోతున్నారు. అసలు ఎవరికి ఏ పదవి దక్కబోతోంది? జూన్ 1న ఏం జరగబోతోంది? రాజ్యసభ ఎన్నికల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? తెలుసుకుందాం.
కర్ణాటకలో జూన్ 1న కొత్త కేబినెట్ కొలువుదీరబోతోంది. అయితే ఈసారి మంత్రివర్గ కూర్పు మామూలుగా ఉండబోవట్లేదు. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూనే.. నలుగురు డిప్యూటీ సీఎంల ఫార్ములాను తెరపైకి తెచ్చింది హైకమాండ్. లింగాయత్, ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ వర్గాల నుంచి నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీ వర్గానికి చెందిన, సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడైన సతీశ్ జర్కిహోళికి కర్ణాటక పీసీసీ చీఫ్ పీఠం అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మంత్రి పదవుల కోసం ఎవరూ ప్లేటు ఫిరాయించకుండా ‘టీమ్ DK’ మాస్టర్ ప్లాన్ వేసింది. జూన్ 1న జరిగే ప్రమాణ స్వీకారంలో డీకే శివకుమార్‌తో పాటు కేవలం 10 మంది లోపే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 34 స్థానాల్లో పాతవారికి కేవలం 10 నుంచి 12 మంత్రి పదవులు మాత్రమే కేటాయించి, మిగతావన్నీ కొత్త రక్తం.. అంటే యువతకు, మహిళలకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఈ పూర్తిస్థాయి విస్తరణ అంతా రాజ్యసభ ఎన్నికల తర్వాతే జరగనుందని టాక్. జూన్ 8న రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసి, ఎన్నిక ఏకగ్రీవమైతే వెంటనే కేబినెట్ విస్తరిస్తారు. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మాత్రం జూన్ 18 వరకు ఊరించబోతున్నారు.
ఇదిలా ఉంటే, అంతర్గతంగా లాబీయింగ్ కూడా గట్టిగానే నడుస్తోంది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు అత్యంత కీలకమైన వైద్యారోగ్య శాఖ లేదా గతంలో డీకే శివకుమార్ హ్యాండిల్ చేసిన పరిశ్రమల శాఖను కేటాయించాలని పట్టుబడుతున్నారు. అటు కోలార్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం తమ జిల్లాకు ఏకంగా 3 మంత్రి పదవులు కావాలంటూ డిమాండ్ల పర్వం మొదలుపెట్టారు. మరి ఈ డిమాండ్లు, సమీకరణాల మధ్య ‘టీమ్ DK’ కర్నాటకను ఎలా నడిపించబోతోందో చూడాలి!
మొత్తానికి కర్ణాటకలో ఎలాంటి అసంతృప్తులకు తావులేకుండా, అటు సామాజిక వర్గాలను సంతృప్తి పరుస్తూనే.. ఇటు యువతకు ఛాన్స్ ఇస్తూ డీకే శివకుమార్ వేస్తున్న అడుగులు కన్నడ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేశాయి. మరి జూన్ 1న జరిగే ప్రమాణ స్వీకారంలో ఎవరెవరు పదవులు చేపట్టబోతున్నారనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
