Andhra: నోటిలో చేప పిల్లతో కనిపించిన అరుదైన సర్పం…
పార్వతీపురం మన్యం జిల్లాలో అరుదుగా కనిపించే పంట్ల పాము సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాలూరు మండలంలోని దేవుబుచ్చింపేట చెరువు సమీపంలో బుధవారం రాత్రి చేపను నోటితో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన ఈ పామును చూసేందుకు గ్రామస్తులు గుమికూడారు. .. .. ..

పార్వతీపురం మన్యం జిల్లాలో అరుదుగా కనిపించే ఓ పంట్ల పాము సంచరించడం స్థానికంగా ఆసక్తి, ఆందోళన కలిగించింది. సాలూరు మండలంలోని బాగువలస రోడ్డుకు సమీపంలో ఉన్న దేవుబుచ్చింపేట చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి చెరువులో చేపను నోటితో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన ఈ పామును చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే సమయంలో రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా పాము కనిపించడంతో కొంతసేపు వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా పామును గమనించారు. పలువురు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ పాము సాధారణంగా కనిపించదని, పంటల ప్రాంతాల్లో అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తుందని తెలిపారు. అందుకే దీనిని స్థానికంగా “పంట్ల పాము” అని పిలుస్తారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాము కనిపిస్తే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయని, వ్యవసాయానికి ఇది శుభసూచకమని పెద్దల నుంచి వస్తున్న నమ్మకం అని రైతులు చెబుతున్నారు. చెరువులో చేపలు అధికంగా ఉండటంతో ఆహారం కోసం బయటకు వచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొద్దిసేపు రోడ్డుపై సంచరించిన ఈ పాము అనంతరం సమీపంలోని పంటపొలాల వైపు జారుకుని వెళ్లిపోయింది. అయితే ఎవరూ దానికి ఎలాంటి హాని కలిగించకుండా దూరం నుంచే గమనించడం విశేషం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన జీవులు కనిపించడం ప్రకృతి సమతుల్యతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
