AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..

వెలిగొండ ప్రాజెక్టు సుంకేసుల పునరావాస కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 17 విద్యుత్‌ స్థంభాలపై ఉన్న విద్యుత్‌ తీగలను కట్‌ చేసి ఎత్తుకెళ్లారు. కాలనీలో పర్యవేక్షణ లేకపోవడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..
Power Wire Theft
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 27, 2026 | 8:59 PM

Share

అడిగేవాడు లేకపోతే అందినకాడికి దోచుకెళ్ళారట.. అలాగుంది ఆ కాలనీలో పరిస్థితి.. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారే కానీ, వాటి పర్యవేక్షణ, రక్షణ అధికారులు గాలికొదిలేశారు. ఫలితంగా 17 విద్యుత్‌ స్థంభాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి మరీ ఎత్తుకెళ్ళారు దొంగలు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా పక్కా ప్లాన్‌తో పనికానిచ్చేశారు. పునరావాస కాలనీలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో తీరిగ్గా విద్యుత్‌ స్థంభాలను ఎక్కిమరీ తీగలను కట్‌ చేసి ఎత్తుకెళ్ళారు.

మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి దగ్గర వెలిగొండ ప్రాజెక్ట్ సుంకేసుల గ్రామ పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గత కొంతకాలంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ క్రమంలో కాలనీలో విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్‌ స్థంభాలు పాతి కరెంట్‌ వైర్లు ఏర్పాటు చేశారు. అయితే దొంగల కళ్ళు వీటిపై పడింది. పునరావాస కాలనీలో జనసంచారం లేకపోవడంతో ఏకంగా 17 విద్యుత్ స్తంభాలపై ఉన్న విలువైన తీగలను దొంగలు ఎత్తుకెళ్ళారు. దొంగలు రాత్రి సమయంలో స్తంభాలపై ఉన్న విద్యుత్ తీగలను కట్ చేసుకొని తీసుకుని పోయి ఉంటారని భావిస్తున్నారు. కాలనీలో అధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో ఇప్పటికే నిర్మించిన ప్రభుత్వ భవనాల తలుపులను కూడా దుండగులు ధ్వంసం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పెద్దారవీడు మండలం లోని అనేక గ్రామాలలో వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ ఫారాలను ధ్వంసం చేసి అందులోని ఖరీదైన తీగలను దొంగలు దోచుకెళుతున్నారు. విద్యుత్ తీగల చోరీకి పాల్పడుతున్న దుండగుల తీరుతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా సుంకేశుల పునరావాస కాలనీలో స్థంభాలపై ఏర్పాటుచేసిన విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి మరీ ఎత్తుకెళ్ళడం విద్యుత్‌ శాఖ అధికారుల లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us