తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి
ఆకలి వేయడం సహజమైన శారీరక ప్రక్రియ. శరీరానికి అవసరమైన శక్తిని పొందేందుకు ఆహారం అవసరం కాబట్టి ఆకలి అనిపిస్తుంది. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా రోజంతా ఏదో ఒకటి తినాలనే కోరిక కలగడం సాధారణ విషయం కాదు. అప్పుడప్పుడు అధిక శారీరక శ్రమ, తక్కువ ఆహారం తీసుకోవడం లేదా జీవనశైలిలో మార్పుల వల్ల ఇలా జరగొచ్చు. కానీ ఈ సమస్య తరచూ కొనసాగితే, దాని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

తరచూ ఆకలితో పాటు బరువు తగ్గడం, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, తీవ్రమైన అలసట లేదా ఇతర శారీరక మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఎప్పుడూ ఆకలిగా అనిపించడానికి కారణమయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే
మధుమేహం (Diabetes)
మధుమేహం ఉన్నవారిలో శరీరం గ్లూకోజ్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేకపోతుంది. దీంతో కణాలకు తగినంత శక్తి అందకపోవడంతో తరచూ ఆకలి వేస్తుంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో పాలీఫేజియా (Polyphagia) అని అంటారు.
హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism)
థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే శరీర జీవక్రియ (మెటబాలిజం) వేగంగా జరుగుతుంది. దీంతో శరీరం ఎక్కువ శక్తిని వినియోగించుకోవాల్సి రావడంతో ఆకలి కూడా పెరుగుతుంది.
తక్కువ రక్త చక్కెర (Hypoglycaemia)
రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గిపోతే తీవ్రమైన ఆకలి, వణుకు, చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళన
ఒత్తిడి, ఆందోళన లేదా భావోద్వేగ సమస్యల కారణంగా కొంతమంది అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు. దీనిని ఎమోషనల్ ఈటింగ్ (Emotional Eating) అంటారు.
పీరియడ్స్ హార్మోన్ల మార్పులు
మహిళల్లో నెలసరి ప్రారంభానికి ముందు హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా ఆకలి పెరగడం సాధారణమే.
కొన్ని మందుల ప్రభావం
స్టెరాయిడ్లు, కొన్ని యాంటీ డిప్రెసెంట్ మందులు, ఇతర ఔషధాలు కూడా ఆకలిని పెంచే అవకాశం ఉంది.
డాక్టర్లు సూచించే పరీక్షలు
తరచూ ఆకలి సమస్య ఉంటే ఈ కింది పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది.
- ఉపవాస రక్త చక్కెర (Fasting Blood Sugar)
- HbA1c పరీక్ష
- థైరాయిడ్ పనితీరు పరీక్షలు (TSH, T3, T4)
- పూర్తి రక్త గణన (CBC)
- అవసరమైతే హార్మోన్ పరీక్షలు
- వైద్య చరిత్ర, ఆహారపు అలవాట్ల అంచనా
తరచూ ఆకలి వేస్తే ఏం చేయాలి?
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు (గుడ్లు, పాలు, పప్పులు, పనీర్) తీసుకోవాలి.
- సంపూర్ణ ధాన్యాలు, పీచుపదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
- జంక్ ఫుడ్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తగ్గించాలి.
- రోజంతా తగినంత నీళ్లు తాగాలి.
- భోజనాన్ని సమయానికి చేయాలి.
- ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.
ఓట్స్, గుడ్లు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, ఆపిల్, బాదం, వాల్‌నట్స్, గ్రీక్ పెరుగు, చియా గింజలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఆకలితో పాటు వేగంగా బరువు తగ్గడం, అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, దృష్టి మసకబారడం, తీవ్రమైన అలసట, వణుకు లేదా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
