అబ్బ క్రిస్పీగా.. సాఫ్ట్‌గా.. మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
సాయంత్రం వేళ వేడివేడిగా తినడానికి తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలు అద్భుతమైన స్నాక్. పచ్చి మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లితో తయారయ్యే ఈ గారెలు బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండాలంటే పిండిని మెత్తగా రుబ్బుకోవడం, నూనె బాగా వేడెక్కిన తర్వాతే వేయించడం వంటి చిన్న చిట్కాలు పాటించాలి. రుచికరమైన ఈ మక్క గారెలు శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి కూడా కొంతమేర మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఎప్పుడైనా వేడివేడిగా ఏదైనా రుచికరమైన తిండి తినాలనిపిస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి తెలంగాణ ప్రత్యేక వంటకమైన ‘మొక్కజొన్న గారెలు’ (మక్క గారెలు).. మొక్కజొన్న గారెలు రుచికరమైన స్నాక్ మాత్రమే కాకుండా, వాటిలో ఉండే పోషకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. మొక్కజొన్నల్లో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శక్తినివ్వడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అయితే చాలామంది చేసేటప్పుడు గారెలు గట్టిగా రావడం లేదా సరిగ్గా పొంగకపోవడం జరుగుతుంటుంది. బయట కరకరలాడుతూ (Crispy), లోపల మెత్తగా పొంగుతూ రావడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వంట నిపుణుల ఆధారంగా, ఇంట్లోనే ఎంతో సులభంగా రుచికరమైన మక్కజొన్న గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- పచ్చి మొక్కజొన్న గింజలు (మక్కలు)
- పచ్చిమిర్చి (కారానికి తగినంత)
- జీలకర్ర
- వెల్లుల్లి రెబ్బలు
- రుచికి సరిపడా ఉప్పు
- కరివేపాకు (సన్నగా తరిగినది)
- కొత్తిమీర (సన్నగా తరిగినది)
- డిప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం:
గింజల తయారీ: ముందుగా పచ్చి మొక్కజొన్న కంకుల నుండి గింజలను ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి.
మిక్సీ పట్టుకోవడం: మిక్సీ జార్‌లో ఒలిచిన మొక్కజొన్న గింజలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకోవాలి.
ముఖ్యమైన చిట్కా (రుబ్బుకోవడం): పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి బరకగా ఉంటే గారెలు గట్టిగా వస్తాయి; మెత్తగా రుబ్బుకుంటేనే గారెలు బాగా పొంగుతూ, లోపల మెత్తగా వస్తాయి.
ఆకులు కలపడం: రుబ్బిన పిండి మిశ్రమంలో సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
గారెలు ఒత్తడం: ఒక తడి కాటన్ గుడ్డ (Cloth) తీసుకొని దానిమీద కొద్దిగా పిండి ముద్దను ఉంచి గుండ్రంగా గారెలా ఒత్తుకొని, మధ్యలో చిన్న రంధ్రం (Hole) చేసుకోవాలి.
కాల్చడం: స్టవ్ మీద బాండీ పెట్టి నూనె బాగా వేడెక్కాక మాత్రమే గారెలను వేయాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే గారెలు నూనె పీల్చకుండా బాగా పొంగుతాయి.
ఫ్రై చేయడం: గారె నూనెలో పైకి పొంగిన తర్వాత గరిటెతో మెల్లగా తిరగేయాలి. గరిటెతో కొద్దిగా కిందికి ఒత్తితే గారే ఇంకా బాగా పొంగుతుంది. రెండు వైపులా మంచి దోర రంగు వచ్చేవరకు కాల్చుకొని తీసేయాలి.
ఈ చిట్కాలతో చేస్తే పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే వేడివేడి తెలంగాణ స్టైల్ మక్కజొన్న గారెలు సిద్ధమవుతాయి. వర్షాకాలంలో లేదా ఎప్పుడైనా స్నాక్స్ టైమ్‌లో ఇవి తింటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. ఇంకెందుకు ఆలస్యం.. చల్లని వాతావరణంలో మక్క గారెలతో ఎంజాయ్ చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
