AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాలు కురుస్తున్నప్పుడు బట్టలు ఆరబెట్టడం చాలా సింపుల్.. ఇలా చేస్తే వాసన కూడా రాదు..

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరకపోవడం, దుర్వాసన రావడం, తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే హ్యాంగర్లపై ఆరబెట్టడం, ఫ్యాన్ సహాయంతో గాలి ప్రసరణ కల్పించడం, ఉప్పుతో గదిలోని తేమను తగ్గించడం, అవసరమైతే టవల్, ఐరన్ లేదా హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం వంటి సులభమైన చిట్కాలతో బట్టలను త్వరగా ఆరబెట్టవచ్చు.

వర్షాలు కురుస్తున్నప్పుడు బట్టలు ఆరబెట్టడం చాలా సింపుల్.. ఇలా చేస్తే వాసన కూడా రాదు..
Clothes Dry Faster
Shaik Madar Saheb
|

Updated on: Jul 27, 2026 | 7:09 PM

Share

అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే.. వర్షాలు కురుస్తుంటే.. బట్టలు ఆరబెట్టడం పెద్ద సవాలుగా మారుతుంది. బయట వానలు పడుతుంటే, ఇంట్లో ఆరబెట్టడం తప్పనిసరి. కానీ ఇంట్లో ఆరబెట్టిన బట్టలు త్వరగా ఆరకపోవడం, ముక్క వాసన రావడం, లేదా తడిగా ఉండడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కొన్ని సమర్థవంతమైన చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో కూడా దుస్తులను తాజాగా, పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.

వర్షాకాలంలో దుస్తుల సంరక్షణ ఇలా..

ఎప్పటికప్పుడు దుస్తులు ఉతకడం: బట్టలను ఎక్కువ కాలం పేరుకుపోనివ్వకుండా, రోజూ ఉతికి ఆరబెట్టడం మొదటి ముఖ్యమైన చిట్కా. ఎక్కువ బట్టలు ఒకేసారి ఉతకడం వల్ల వాటిని ఆరబెట్టడానికి స్థలం సరిపోకపోవచ్చు, పైగా అవి త్వరగా ఆరవు.

నీటిని సమర్థవంతంగా తొలగించడం: వాషింగ్ మెషీన్ ఉన్నవారు డ్రైయర్ (స్పిన్ సైకిల్) ను రెండుసార్లు ఉపయోగించడం వల్ల బట్టల నుండి అధిక మొత్తంలో నీరు తొలగిపోతుంది. వాషింగ్ మెషీన్ లేనివారు బట్టలను గట్టిగా పిండడం ద్వారా నీటిని బయటకు పంపాలి. ఇది ఆరబెట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

హ్యాంగర్ల వినియోగం: దండం మీద బట్టలను వేయడం కంటే, హ్యాంగర్లకు వేసి ఆరవేయడం వల్ల బట్టల మధ్య గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. బట్టలు ఒకదానికొకటి అంటుకోకుండా వేరుగా ఉంటాయి కాబట్టి త్వరగా ఆరిపోతాయి. చిన్నపిల్లల దుస్తుల కోసం ఒకే హ్యాంగర్‌కు అనేక క్లిప్‌లు ఉన్న ప్రత్యేక హ్యాంగర్లను ఉపయోగించవచ్చు.

ఫ్యాన్ సహాయంతో ఆరబెట్టడం: వర్షాకాలంలో సాధారణంగా చల్లగా ఉండడం వల్ల ఫ్యాన్ వేయడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే, బట్టలు ఆరేసే గదిలో ఫ్యాన్ వేయడం చాలా ప్రయోజనకరం. రాత్రిపూట బట్టలను ఫ్యాన్ కింద ఆరేసి ఉంచితే ఉదయానికల్లా ఆరిపోతాయి. ఇది బట్టలు త్వరగా ఆరడమే కాకుండా, ముక్క వాసన రాకుండా చేస్తుంది.

తేమను నియంత్రించడం: బట్టలు ఆరవేసే గదిలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటే, బట్టలు ఆరడం కష్టమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి, ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పును వేసి బట్టలు ఆరవేసే గదిలో ఉంచండి. ఉప్పు గాలిలోని తేమను పీల్చుకుంటుంది. తద్వారా బట్టలు త్వరగా ఆరుతాయి. అలాగే, గదిని వెచ్చగా ఉంచడానికి కొబ్బరి చిప్పలతో కానీ, బొగ్గులతో కానీ ధూపం వేయడం లేదా అగరబత్తులు, ధూప్ కోన్స్ వెలిగించడం వల్ల గదిలో వెచ్చదనం పెరిగి, దుర్గంధం దూరమవుతుంది.

అత్యవసర పరిస్థితులలో చిట్కాలు:

టవల్ – ఐరన్: బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు బట్టలు తడిగా ఉంటే, ఉతికిన డ్రెస్ ను గట్టిగా పిండి, ఒక పొడి టవల్‌లో చుట్టి బాగా నొక్కండి. టవల్ నీటిని పీల్చుకున్నాక, ఐరన్ బాక్స్ తో తడిగా ఉన్న డ్రెస్ ను ఐరన్ చేస్తే అది త్వరగా ఆరిపోతుంది.

హెయిర్ డ్రైయర్: హెయిర్ డ్రైయర్ ఉపయోగించి కూడా తడి బట్టలను త్వరగా ఆరబెట్టవచ్చు. ఇది అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది.

దుర్గంధం – ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణ:

ఫ్యాబ్రిక్ కండీషనర్లు: బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వంటి ఫ్యాబ్రిక్ కండీషనర్లను వాడటం వల్ల అవి ఎల్లప్పుడూ మంచి సువాసనతో ఉంటాయి.

డెటాల్ వినియోగం: తడి బట్టల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెటాల్‌ను ఉపయోగించి బట్టలు ఉతకడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు నశించి, చర్మ సమస్యలు నివారించబడతాయి.

వార్డ్‌రోబ్ సంరక్షణ: వార్డ్‌రోబ్‌లో పురుగులు రాకుండా, దుస్తులు మంచి వాసనతో ఉండాలంటే, డెటాల్ లేదా కంఫర్ట్‌లో ముంచిన దూదిని వార్డ్‌రోబ్‌లో ఉంచండి. ఒక బౌల్‌లో ఉప్పును ఉంచడం వల్ల వార్డ్‌రోబ్‌లోని తేమ కూడా పీల్చుకుంటుంది.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా, వర్షాకాలంలో కూడా బట్టలు త్వరగా ఆరడమే కాకుండా, తాజా సువాసనతో ఉంటాయి. తక్కువ స్థలం ఉన్నవారు కూడా ఈ పద్ధతులను ఉపయోగించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో దుస్తుల సంరక్షణ చేపట్టవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us