Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. కోస్తా ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, సముద్ర అలల ఉద్ధృతి పెరగడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పలు జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతుండగా, రైతులు వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయంగా 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం, గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బాలాసోర్ – క్యానింగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో దీని తీవ్రత అత్యధికంగా ఉండబోతోందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సముద్రంలో అలజడి రేగి అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు ఎగిసిపడుతుండటంతో పాటు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారడమే కాకుండా, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు వర్షం సమయంలో చెట్లు, పాత భవనాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే వెళ్లిన వారు వెంటనే సురక్షిత తీరాలకు తిరిగిరావాలని అధికారులు ఆదేశించారు. దేశవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగానికి కరువు తీరాలనే సంకల్పంతో ఆదివారం కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో కాటన్ మర్చంట్, గ్రౌండ్ నెట్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మహా వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగే ఈ యాగంలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ జిందే శారదతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. వానలు పడి పంటలు బాగా పండాలని యాగం ద్వారా దేవుళ్లను వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా వెలుగుడు గ్రామానికి చెందిన రైతులు ఆదివారం వర్షాల కోసం నల్లమల అటవీ ప్రాంతానికి తరలివెళ్లారు. అడవిలో ఉన్న యాగానందీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వర్షభావ పరిస్థితులు నెలకొనడంతో సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామస్థులంతా ఐక్యంగా వెళ్లి ఈ పూజలు జరిపారు. సకాలంలో వర్షాలు కురిసి తమ పొలాలు పచ్చదనంతో విలసిల్లాలని స్వామివారిని మొక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు వాతావరణ సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కారు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం సందర్భంగా ఇరుకుల్ల దారి మైసమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కారు డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని మొక్కులు చెల్లించుకున్నారు. సంఘం అధ్యక్షుడు బుచ్చన్న నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ వినూత్న పూజలు చేశారు. విత్తనాలు వేసి నార్లు పోసినా వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతుల కోసం మహిళలంతా ఒకటై బొడ్రాయికి జలాభిషేకం చేశారు. బిందెలతో నీళ్లు తెచ్చి ఊరి బొడ్రాయిపై చల్లుతూ, చుట్టుకాముడు ఆడుతూ నీటి కోసం ప్రార్థించారు. స్థానిక కళాకారుల జానపద నృత్యాల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతుండటంతో అడవిలోని జలపాతాలు కొత్త కళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తిర్యాని మండలంలోని చింతల మదార, లింగాపూర్ పరిధిలోని మిట్టె జలపాతాలు నురగలు గక్కుతూ ప్రవహిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు చుక్క నీరు లేక బోసిపోయిన గుండాల, సప్తగుండాల జలపాతాలు కూడా జలసవ్వడులతో సందడి చేస్తున్నాయి. ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చటి అడవుల నడుమ సహజ సిద్ధంగా వెలసిన ఈ ప్రకృతి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాలు లేక మంచిర్యాల జిల్లా భీమారం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా వెలవెలబోతోంది. ఎల్ నినో తీవ్ర ప్రభావంతో పాటు ఎగువన సరైన వానలు కురవకపోవడంతో నీటిమట్టం అడుగుభాగాలకు పడిపోయింది. ప్రాజెక్టు కింద ఆయకట్టు ఉన్న భీమారం, చెన్నూర్ మండలాల్లోని 9,500 ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. జూలై ఆఖరు దాటుతున్నా చుక్క నీరు చేరకపోవడంతో ఆర్కెపల్లి, అంకూసాపూర్, కొత్తపల్లి పరిసర గ్రామాల రైతులు దుక్కులు దున్నకుండా భూములను బీడుగానే వదిలేశారు. నీళ్లు లేక ప్రాజెక్టు ప్రాంతం మైదానంగా మారిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 37,200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో నిలిచిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.360 మీటర్లకు చేరింది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 820.80 అడుగుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 41.39 టీఎంసీలుగా నమోదైంది. కర్నూలు సరిహద్దులోని తుంగభద్ర డ్యామ్‌కు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌లోకి 19,486 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు 3,638 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1,607.23 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నిన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన నదీ తీరం, ప్రస్తుతం ప్రవాహం పెరిగి ఒడ్డును తాకుతూ ముందుకు సాగుతోంది. కాలేశ్వరం పరిసర ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆ నీరంతా భద్రాచలం వద్దకు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 15.3 అడుగులకు చేరుకోగా, డెలివరీ ప్రవాహం 1,01,747 క్యూసెక్కులుగా నమోదు కాగా నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో భానుడి తాపానికి ఉపశమనం కలిగిస్తూ ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో మేఘాలు దట్టంగా పట్టి వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసపేట్, జగద్గిరిగుట్ట పరిసరాల్లోనూ వాన పడటంతో వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచే నగరవ్యాప్తంగా చిరుజల్లులు మొదలయ్యాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున నగరానికి ‘ఆరెంజ్ అలెర్ట్’ జారీ చేశారు. సూరత్‌లో నాలుగు రోజులైనా తగ్గని వరద ముప్పు..సూరత్‌లో నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఇప్పటికీ వరద నీరు నిల్వ ఉంది. మాధవ్‌బాగ్ సొసైటీలో ఇప్పటికీ వరద నీరు తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ఇళ్లలో దాదాపు 6 అడుగుల మేర నీరు చేరింది.తాగునీరు, పాలు అందుబాటులో లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు తగ్గకపోవడంతో పలువురు తమ ఇళ్లను విడిచి బంధువులు, ఇతరుల ఇళ్లలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు .. భారీ వర్షాలతో నాడాబెట్ ఎడారి జలమయం..గుజరాత్‌లోని వావ్–థరాద్ ప్రాంతంలోని సుయిగామ్‌లో భారీ వర్షాల కారణంగా విస్తృతంగా నీరు నిలిచిపోయింది. భారత్–పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని నాడాబెట్ ఎడారి భారీ వర్షాలతో బురదమయంగా మారింది. ఎప్పుడూ పొడిగా కనిపించే నాడాబెట్ ఎడారి ప్రస్తుతం వర్షపు నీటితో నిండిపోయి సముద్రాన్ని తలపించేలా మారింది. ఎడారిలో ఏర్పడిన ఈ అరుదైన జలదృశ్యాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyber Crime:పార్శిల్ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!
ఇండియా పోస్ట్ పేరుతో కొత్త సైబర్ మోసం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..

