AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మరణించారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి రావడం అందరినీ కలచివేస్తోంది.

టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత
Pavala Syamala Passed Away
SN Pasha
|

Updated on: Jul 28, 2026 | 6:19 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి అనంతరం తుదిశ్వాస విడిచారు. రాత్రి 1:52 గంటలకు తీవ్రమైన గుండెపోటుతో ఆమె మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

పావలా శ్యామల మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, జీవిత చరమాంకంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి రావడం అందరినీ కలచివేస్తోంది. ఆమెతో పాటు కుమార్తె మాధవి కూడా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

వైద్యుల సమాచారం ప్రకారం పావలా శ్యామల హైబీపీ, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వ్యాధి, గుండె సంబంధిత సమస్యలతో చాలాకాలంగా బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఆమె, కుమార్తె మాధవిని హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. వారిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించగా, చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే ఉస్మానియా ఆసుపత్రిలో ఉండలేమని చెప్పడంతో వారు మళ్లీ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి బోరబండ పోలీసుల సహకారంతో నగరంలోని అనాథాశ్రమానికి తరలించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గతవారం మళ్లీ ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయినట్లు సమాచారం. ఇదే సమయంలో కుమార్తె మాధవిని కూడా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులు ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.

సినీ పరిశ్రమలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణంపై టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Follow Us