AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..

ఇన్‌స్టాలో పదో తరగతి అమ్మాయితో పరిచయం పెంచుకొని.. ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో పడేసుకున్నాడో కేటుగాడు.. అంతటితో ఆగకుండా పేరెంట్స్‌కు చెప్పకుండా బాలికను తనతోపాటు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి దాదాపు 3 నెలల పాటు దేశమంతా తిరిగారు. కట్‌చేస్తే కేసులోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..
Guntur Minor Girl Rescued After 3month Interstate Chase
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 3:17 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఓ యువకుడిని పోలీసులు మూడు నెలల సుదీర్ఘ గాలింపు అనంతరం హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని క్షేమంగా కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురానికి చెందిన పదో తరగతి బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన జాన్‌సైదాతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం చనువుగా మారింది. బాలిక నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు బయటకు వెళ్దామని నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా, నగదు, బంగారంతో సహా అతనితో వెళ్లిపోయింది.

గుంటూరు నుంచి నెల్లూరుకు బైక్‌పై చేరుకున్న ఇద్దరు, అక్కడి నుంచి చెన్నై, కోయంబత్తూరు, కేరళలోని పాలక్కాడ్‌ వరకు వెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినా నిందితుడు పదేపదే ఫోన్లు, సిమ్‌ కార్డులు మారుస్తూ, ఆన్‌లైన్ పేమెంట్స్ చేయకుండా స్నేహితుల సాయంతో తప్పించుకు తిరిగాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే పాలక్కాడ్ నుంచి సికింద్రాబాద్ మీదుగా హర్యానాకు మకాం మార్చాడు.

మూడు నెలలుగా ఆచూకీ లభించకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో బాలిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తల్లికి ఫోన్ కాల్ రావడంతో, పోలీసులు ఐపీ (IP) అడ్రస్ ఆధారంగా సాంకేతిక ఆధారాలు సేకరించారు. నిందితుడు హర్యానాలోని కర్నాల్ నగరంలో ఉన్నట్లు గుర్తించి, స్థానిక పోలీసుల సాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిని, బాలికను విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. నిందితుడు జాన్‌సైదాపై ఇప్పటికే పర్చూరు పీఎస్‌లో ఓ కేసు నమోదై ఉందని, ఈ ఘటనపై లవ్ జిహాద్ ఆరోపణలు కూడా రావడంతో అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us