Abhishek Sharma: 13 సిక్సర్లు, 7 ఫోర్లతో రికార్డులను తిరగరాసిన అభిషేక్.. హిస్టరీ క్రియేట్ చేసిన ఒకే ఒక్కడు
Abhishek Sharma:టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన అభిషేక్ శర్మ రికార్డుల విధ్వంసం. ఇంగ్లాండ్‌పై 135 పరుగులు చేసి, 37 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. భారతదేశం తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఒక్కరూ 150 పరుగుల మార్కును అందుకోలేకపోయారు.

Abhishek Sharma: నేటితరం అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవడం కామన్‌గా మారింది. బ్యాటర్లకు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లపై పరుగులు సాధించడం సులువుగా మారడంతో ఒకప్పుడు వన్డేల్లో మాత్రమే సాధ్యమయ్యే భారీ స్కోర్లు ఇప్పుడు టీ20ల్లో కూడా సాకారమవుతున్నాయి. 2026 నాటికే ముగ్గురు విదేశీ బ్యాటర్లు పొట్టి ఫార్మాట్‌లో 150 ప్లస్ పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. 120 బంతుల ఆటలో 150 రన్స్ చేయడం అసాధ్యం అనుకున్న వేళ ఈ ఘనత సాధించారు. అయితే భారతదేశం తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఒక్కరూ 150 పరుగుల మార్కును అందుకోకపోయినప్పటికీ, అత్యంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌తో టీమిండియా తరఫున ఆల్-టైమ్ రికార్డు నెలకొల్పిన ఘనత మాత్రం యువ సంచలనం అభిషేక్ శర్మకే దక్కుతుంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఆకాశమే హద్దుగా విరుచుకుపడుతూ కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. భారతదేశం తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఏకంగా 13 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 106 పరుగులు రాబట్టడం అతని విధ్వంసానికి అద్దం పడుతోంది. ఈ మ్యాచ్‌లోనే కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని భారత్ తరఫున రెండో వేగవంతమైన టి20 సెంచరీ నమోదు చేశాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 120 కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ చేసిన 126 పరుగులు, ఆస్ట్రేలియాపై రుతురాజ్ గైక్వాడ్ సాధించిన 123 పరుగులు అగ్రస్థానాల్లో ఉండేవి. కానీ అభిషేక్ శర్మ 135 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో ఆ రికార్డులన్నింటినీ అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. వీరితో పాటు విరాట్ కోహ్లీ 122 పరుగులు, రోహిత్ శర్మ 121 పరుగులు, తిలక్ వర్మ 120 పరుగులు సాధించి ఈ అరుదైన జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.
అభిషేక్ శర్మ చూపిన ఈ అద్భుతమైన ఫామ్ టీమిండియా ఓపెనింగ్ సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. మొదటి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం, పవర్ ప్లేను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఆడుతున్న అతని స్టైల్ జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. ఇలాంటి భయమెరుగని ఆ ఆటతీరే రాబోయే రోజల్లో భారత్‌ను పొట్టి ఫార్మాట్‌లో తిరుగులేని శక్తిగా నిలబెడుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
