ఈ పక్షి గూడు కట్టదు.. ఇదిగో ఇలా నేలపైనే గుడ్లు పెడుతుంది.. ఆ తర్వాత
గ్రామాల్లోనైనా.. పట్టణాల అంచుల్లోనైనా.. రాత్రి సమయంలో ఒక్కసారిగా వినిపించే ఓ విచిత్రమైన శబ్దం చాలామందికి భయాన్ని కలిగిస్తుంది. ఆ శబ్దం వినగానే “తీతువ అరిచింది.. ఏదో అపశకునం జరుగుతుందేమో” అని పెద్దలు చెప్పుకునే సందర్భాలు ఇప్పటికీ కనిపిస్తాయి. కానీ నిజంగా తీతువ పక్షి అరిస్తే చెడు జరుగుతుందా? అసలు ఈ పక్షి ఏమిటి? ఎందుకు రాత్రివేళ ఎక్కువగా అరుస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగులో “తీతువ” అని పిలిచే ఈ పక్షిని ఇంగ్లీషులో సాధారణంగా నైట్‌జర్ లేదా కొన్ని ప్రాంతాల్లో ల్యాప్‌వింగ్ జాతులతో పోలుస్తారు. ప్రాంతానికో పేరు, రూపం మారినా.. రాత్రి వేళల్లో చేసే గట్టిపిలుపుతో ఈ పక్షి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ పక్షులు ఎక్కువగా పొలాల దగ్గర, చెట్లతో నిండిన ప్రాంతాల్లో, గ్రామాల బయట, చెరువుల సమీపంలో కనిపిస్తాయి. పగలు చాలా నిశ్శబ్దంగా ఉండే ఇవి.. రాత్రి సమయంలో మాత్రం గట్టిగా శబ్దాలు చేస్తుంటాయి. తీతువ పక్షి రాత్రిపూట చురుకుగా ఉండే జాతికి చెందింది. ఆహారం కోసం తిరగడం, తన ప్రాంతాన్ని గుర్తు చేయడం, జతను ఆకర్షించడం, ప్రమాదాన్ని హెచ్చరించడం వంటి కారణాలతో అరుస్తుంది. ముఖ్యంగా చీకటి పెరిగినప్పుడు, వర్షాలు పడే ముందు, ఎవరో దగ్గరికి వచ్చినప్పుడు, గుడ్లు లేదా పిల్లలకు ప్రమాదం అనిపించినప్పుడు ఇవి మరింత గట్టిగా శబ్దం చేస్తాయి.
పాతకాలంలో గ్రామాల్లో రాత్రివేళ నిశ్శబ్దం ఎక్కువగా ఉండేది. అప్పుడు ఒక్కసారిగా వినిపించే తీతువ అరుపు ప్రజల్లో భయాన్ని కలిగించేది. అదే సమయంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. ఆ పక్షి అరుపుకే కారణమని భావించేవారు. అందుకే ఇంటి మీద తీతువ అరుస్తే చెడు, గ్రామంలో తిరుగుతూ అరిస్తే ప్రమాదం, మరణ సూచన లాంటి అపోహలు పుట్టుకొచ్చాయి. కానీ శాస్త్రీయంగా వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. తీతువ పక్షి రైతులకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది పురుగులు, దోమలు, చిన్న కీటకాలను తింటూ పంటలకు హాని చేసే జీవులను తగ్గిస్తుంది. ప్రకృతి సమతుల్యతలో ఈ పక్షుల పాత్ర చాలా ముఖ్యమైనది.
వీటి ప్రత్యేకత ఏమిటంటే.. గూడు కట్టకుండా సహజ వాతావరణాన్నే ఆశ్రయిస్తాయి. గుడ్ల రంగు కూడా నేల రంగులో కలిసిపోయేలా ఉంటుంది. శత్రువులకు కనిపించకుండా క్యామఫ్లేజ్ పద్ధతిలో రక్షణ పొందుతాయి. ఆడ, మగ పక్షులు రెండూ గుడ్లను కాపాడుతాయి. ఎవరు దగ్గరికి వచ్చినా గట్టిగా అరుస్తూ పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తాయి. పొలాల్లో నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ చుట్టూ తిరగడం వల్ల ఈ పక్షులను చాలామంది “ఏదో సూచన ఇస్తోంది” అని భావించేవారు. కానీ నిజానికి అది తన గుడ్లు, పిల్లలను కాపాడే సహజ స్వభావం మాత్రమే.
మనుషులకు అర్థం కాని శబ్దం వినిపిస్తే దానిని భయంతో చూడటం సహజం. కానీ ప్రకృతిలో ప్రతి జీవి తనకోసం, తన బతుకుకోసం చేసే చర్యలే అవి. తీతువ పక్షి అరుపు కూడా అలాంటిదే. అది ఎలాంటి శకునం కాదు.. ప్రకృతి ఇచ్చే ఓ సహజమైన శబ్దం మాత్రమే. ఈ పక్షులు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.
