AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నీ బ్యాడ్‌లక్ తగలెయ్య.. మరోసారి ‘హిట్ వికెట్’గా సాయి సుదర్శన్.. గిల్ ఏం చేశాడంటే?

GT s RR, Sai Sudharsan hit wicket: గుజరాత్ ఓపెనర్లు సృష్టించిన విధ్వంసంతో అంతటి భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. సాయి సుదర్శన్ అవుటైన విధానం కాస్త బాధాకరమే అయినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో సునాయాస విజయం వైపు దూసుకెళ్లింది.

Video: నీ బ్యాడ్‌లక్ తగలెయ్య.. మరోసారి ‘హిట్ వికెట్’గా సాయి సుదర్శన్.. గిల్ ఏం చేశాడంటే?
Sai Sudharsan Hit Wicket Video
Venkata Chari
|

Updated on: May 30, 2026 | 8:05 AM

Share

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ దురదృష్టకర రీతిలో అవుటయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’గా వెనుదిరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చూసి అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్‌పైనే మోకాళ్లపై కూలబడ్డాడు.

దురదృష్టం అంటే సాయి సుదర్శన్‌దే.. చేతిలోంచి జారిన బ్యాట్!

రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసిన సుదర్శన్ ప్రమాదకరంగా మారుతున్న వేళ, మ్యాచ్‌లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రాజస్థాన్ అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన బంతిని సుదర్శన్ ఎంతో అందంగా టైమింగ్ చేస్తూ షాట్ ఆడాడు. ఆ బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. కానీ, అదే సమయంలో అతడి చేతిలోంచి బ్యాట్ ఊడి గాల్లోకి లేచి, వెనకాల ఉన్న వికెట్లను తాకింది. దీంతో బెయిల్స్ కింద పడిపోవడంతో అంపైర్ అతడిని హిట్ వికెట్‌గా ప్రకటించాడు.

వారంలోనే ఇలా జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇదే రీతిలో అవుటై నిరాశగా వెనుదిరిగాడు.

తల పట్టుకున్న కెప్టెన్ గిల్.. వైరల్ అవుతున్న వీడియో..

సాయి సుదర్శన్ ఆడిన ఆ షాట్ అంత పర్‌ఫెక్ట్‌గా కనెక్ట్ అయినా, చివరకు అలా అవుట్ అవ్వడం చూసి నాన్‌ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మలేకపోయాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన గిల్, పిచ్‌పైనే మోకాళ్లపై కూలబడి తల పట్టుకున్నాడు. సుదర్శన్ దురదృష్టానికి ఎంతలా బాధపడాలో తెలియక గిల్ వ్యక్తపరిచిన ఈ హావభావాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో ముగియడం పట్ల అభిమానులు కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

కోహ్లీ, డివిలియర్స్ రికార్డులను బద్దలు కొట్టిన జోడీ..

దురదృష్టకర రీతిలో ఈ జోడీ విడిపోయినప్పటికీ, అంతకంటే ముందే వీరిద్దరూ కలిసి చరిత్ర సృష్టించారు. గిల్, సుదర్శన్ జోడీ కేవలం 12.5 ఓవర్లలోనే 167 పరుగుల భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక యాభై ప్లస్ పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా ఆర్‌సీబీ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వీరు అధిగమించారు. అంతేకాకుండా, ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య నమోదైన 11వ శతక భాగస్వామ్యం ఇది. ఈ విభాగంలోనూ వారు కోహ్లీ-డివిలియర్స్ ద్వయాన్ని వెనక్కి నెట్టి సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులతో చెలరేగగా, చివర్లో రవీంద్ర జడేజా (45*), డోనోవన్ ఫెరీరా (38*) మెరుపులు మెరిపించారు. అయితే, గుజరాత్ ఓపెనర్లు సృష్టించిన విధ్వంసంతో అంతటి భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. సాయి సుదర్శన్ అవుటైన విధానం కాస్త బాధాకరమే అయినప్పటికీ, గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో సునాయాస విజయం వైపు దూసుకెళ్లింది.

Follow Us