తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేందుకు సుఫారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన చిన్న కొడుకు
తల్లిదండ్రులను కిడ్నాప్ చేసేందుకు ఆరుగురికి సుఫారీ ఇచ్చాడు చిన్న కొడుకు. వృద్ధులను కిడ్నాప్ చేసేందుకు వెళ్లిన ఆరుగురు ముఠా.. అదే సమయంలో అక్కడే బందోబస్తుగా ఉన్న పోలీసులకు చిక్కడంతో గుట్టు కాస్త రట్టు అయింది.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి పెద్ద ఫ్యాక్షన్ గ్రామం. సీఐ యుగందర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు కూడా గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు లక్ష్మీదేవి దంపతులు నివసిస్తున్నారు. వయస్సు దాదాపు 70 సంవత్సరాలు. ఈ వృద్ధ దంపతుల పేరు మీద కోడుమూరులో విలువైన ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని కాజేయాలని కొట్టేయాలని చిన్న కొడుకు తిప్పరాజు ప్లాన్ వేశాడు. తన పేరున రాసి ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. ఉన్న పొలం కాస్తా ఇచ్చేస్తే.. తాము ఎలా బతకాలి అని వారు ప్రశ్నించారు. దీంతో పేరెంట్స్ నుంచి బలవంతంగా రాయించుకోవాలని ప్లాన్ వేశాడు చిన్న కొడుకు తిప్పరాజు. వృద్ధ దంపతులకు ఇతర కొడుకులు కూతుర్లు ఉన్నప్పటికీ ఆ స్థలం తనకే కావాలని చిన్న కొడుకు తిప్పరాజు పట్టుబట్టాడు.
గ్రామంలో ఉన్న దంపతులను కిడ్నాప్ చేసి తీసుకురావాలని కోడుమూరుకు చెందిన ఆరుగురికి సుఫారి ఇచ్చాడు తిప్పరాజు. ఒప్పందం ప్రకారం టాటా సుమోలో కిడ్నాప్ చేసేందుకు మల్లేపల్లి వెళ్లారు కిడ్నాపర్లు. అయితే అక్కడే ఉన్న సీఐ యుగంధర్ ఇతర పోలీసులకు కొత్త వ్యక్తులు వాహనంలో రావడంతో విచారించారు. వారిని ఆపి విచారించగా.. వివరాలు చెప్పలేక తడబడ్డారు. తమదైన శైలిలో హెచ్చరించడంతో వాస్తవం కక్కేశారు. కిడ్నాప్ కథ కాస్త తిరగబడింది. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తిప్పరాజు సంగతి బయటపడింది. వృద్ధులు కూడా పోలీసులకు విషయం చెప్పి బోరుమనడంతో.. సుపారీ బ్యాచ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సొంత కొడుకు నుంచే తమకు ఇబ్బందులు వస్తుండటం పట్ల వృద్ధులు ఆందోళనకు గురవుతున్నారు. తమని కాపాడాలని పోలీసులను కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..