పూత నిలిచేందుకు నిమ్మతోటల్లో పాటించాల్సిన జాగ్రత్తలు..
నిమ్మతోటల్లో అధిక దిగుబడి సాధించడానికి పూత, పిందె రాలడాన్ని నియంత్రించడం అత్యవసరం. మార్చి నుంచి జూన్ వరకు మంచి దిగుబడి కోసం, నీటి యాజమాన్యం, రసాయన పిచికారీలు, పోషకాల సరఫరా కీలకం. బహార్ పద్ధతితో పాటు, సరైన ఎరువులు, సూక్ష్మపోషకాలు, తెగుళ్ల నివారణ చర్యలతో నాణ్యమైన కాయలు పొందవచ్చు.

నిమ్మతోటల్లో ఏడాది పొడవునా పూత, కాయలు ఉన్నప్పటికీ, రైతులకు మార్చి నుంచి జూన్ వరకు వచ్చే దిగుబడి నుంచే ప్రధాన ఆదాయం లభిస్తుంది. ఈ కీలకమైన సమయంలో పూత రాలడాన్ని సమర్థవంతంగా నియంత్రించడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు.
నిమ్మలో సహజ పూత చక్రం:
దక్షిణ భారతదేశంలోని నిమ్మతోటల్లో రెండు శాతం మాత్రమే సహజంగా పూత ఏర్పడుతుంది. మొదటి పూత జనవరి-ఫిబ్రవరిలో వచ్చి మూడు నెలలకు కాయలుగా మారి, ఏప్రిల్ నుండి జూన్ వరకు దిగుబడినిస్తుంది. రెండవ పూత జూన్-జులైలో వచ్చి అక్టోబరులో దిగుబడికి వస్తుంది. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా, సంవత్సరం పొడవునా చెట్లపై వివిధ దశల్లో పూత, పిందె, కాయలను గమనించవచ్చు. అయితే, రైతులు మొక్కలకు నిరంతరం నీటిని అందించడం వల్ల సరైన సమయంలో పూతకు రావడం లేదు. వేసవిలో కాయలకు మంచి డిమాండ్ ఉన్నందున, రైతులు కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు.
బహార్ పద్ధతి (నీటి కొరత ద్వారా పూత ప్రేరణ):
వేసవిలో కాయ దిగుబడిని పెంచడానికి, నవంబర్‌లో చెట్లను వాడుకు తీసుకురావాలి. నిమ్మ జాతి చెట్లలో పూత రావడానికి కొమ్మల్లో పిండి పదార్థాలు ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉండాలి. చెట్లను వాడుకు గురి చేయడం వల్ల కొమ్మల్లో పిండి పదార్థాల నిల్వ పెరుగుతుంది. 10 నుంచి 15 రోజులు నీరు ఆపి, ఆ తర్వాత ఒకేసారి నీటిని, పోషకాలను అందించి కొమ్మలను చిగురింప చేయాలి. చిగురించిన కొమ్మల అడుగు భాగాలపై పూత ఏర్పడుతుంది. ఈ పద్ధతిని బహార్ పద్ధతి అంటారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నిమ్మ సాగు ప్రాంతాల్లో అక్టోబరు-నవంబరులో ఈశాన్య రుతుపవనాల తాకిడికి వర్షాలు అధికంగా కురుస్తాయి. ఇలాంటి సమయాల్లో చెట్లను సహజంగా వాడుకు తీసుకురావడం సాధ్యం కాదు. అప్పుడు రైతులు ప్రత్యామ్నాయ యాజమాన్య పద్ధతులను పాటించి వేసవిలో అధిక దిగుబడులు పొందవచ్చు.
సమగ్ర యాజమాన్య పద్ధతులు:
1. రసాయన పిచికారీలు:
నాణ్యమైన దిగుబడుల కోసం జూన్‌లో 50 పి.పి.యం జిబ్బరెల్లిక్ ఆమ్లాన్ని, సెప్టెంబరులో 1000 పి.పి.యం సైకోసెల్ ద్రావణాన్ని, అక్టోబరులో లీటరు నీటికి 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.
2. ఎరువుల యాజమాన్యం:
నవంబరు మొదటి పక్షంలో ప్రతి చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాముల యూరియా, 400 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్ల పాదుల్లో వేసి నీటిని అందించాలి. ఎరువులు వేసిన 10-15 రోజులకు చెట్లు చిగురించి పూత రావడం మొదలవుతుంది. జనవరిలో కాయ పెరిగే దశలో ఒక్కో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రాముల యూరియా, 350 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి నీటిని అందించాలి.
3. సూక్ష్మపోషకాల పిచికారీ:
చిగురు వచ్చిన 10-15 రోజులకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు మాంగనీస్ సల్ఫేట్, 2 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్, 2 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 3 గ్రాములు కాపర్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్, 6 గ్రాములు సున్నం, 10 గ్రాములు యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
4. పిందె రాలడం నివారణ:
పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వల్ల రాలిపోతుంది. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 2.5 మి.లీ ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయాలి. కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
5. మల్చింగ్ (మొక్కల పాదులను కప్పడం):
ఫిబ్రవరిలో 2.5 సెంటీమీటర్ల మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరిగడ్డి వంటి వ్యవసాయ పదార్థాలతో చెట్ల పాదులను కప్పాలి. దీనివల్ల వేసవిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, సేంద్రియ పదార్థం అందుబాటులోకి వస్తుంది.
6. తెగుళ్లు, రసం శాతం మెరుగుదల:
నిమ్మకాయ గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా నీటిలో కరిగే గంధకం (3 గ్రాములు/లీటరు నీటికి) లేదా ప్రొపార్గైట్ (2 మి.లీ/లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. * వేసవిలో కాయ పరిమాణం, రసం శాతం తక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 10 గ్రాములు పొటాషియం నైట్రేట్ కలిపి పిచికారీ చేయాలి.
7. కాయ రంగు మార్పు నివారణ:
మార్చి-ఏప్రిల్‌లో ఎండ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాయ పసుపు లేదా గోధుమ రంగుకు మారవచ్చు. దీన్ని నివారించడానికి లీటరు నీటికి 10 గ్రాములు యూరియా కలిపి పిచికారీ చేయాలి. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా నిమ్మ రైతులు పూత రాలడాన్ని సమర్థవంతంగా నియంత్రించి, నాణ్యమైన, అధిక దిగుబడిని సాధించి మంచి ఆదాయం పొందవచ్చు.
