అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తెలుసా?
Bengal Durga Puja Special: బంగాల్‌లోని మిడ్నాపుర్‌లో చక్రవర్తి కుటుంబం సుమారు 200 ఏళ్లుగా ప్రత్యేకమైన దుర్గా పూజను నిర్వహిస్తోంది. అమ్మవారికి చేపల వంటకాలను నైవేద్యంగా సమర్పించడం, 108 నీలి కలువలతో పూజించడం, పట్‌చిత్రంపై అమ్మవారి రూపాన్ని ఆరాధించడం ఈ పూజ ప్రత్యేకతలు.

Bengal Durga Puja Special: పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ప్రతి ప్రాంతంలోనూ స్థానిక సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా అమ్మవారిని కొలుస్తుంటారు. అయితే మిడ్నాపుర్‌లోని మియా బజార్‌కు చెందిన చక్రవర్తి కుటుంబం నిర్వహించే దుర్గా పూజ మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. సుమారు రెండు శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పూజలో కొన్ని ఆశ్చర్యకరమైన సంప్రదాయాలు నేటికీ కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మవారికి చేపల వంటకాలను నైవేద్యంగా సమర్పించడం, అష్టమి రోజున 108 నీలి కలువ పువ్వులతో పూజించడం ఈ కుటుంబ దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయి.
విగ్రహానికి బదులుగా పట్‌చిత్రంపై పూజ
చక్రవర్తి కుటుంబం దుర్గా పూజలో మరో విశేషం అమ్మవారి విగ్రహానికి సంబంధించినది. సాధారణంగా దుర్గా పూజలో మట్టితో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ కుటుంబంలో మాత్రం మట్టి విగ్రహాన్ని ఉపయోగించరు. పవిత్రమైన పెయింటెడ్ స్క్రోల్ (పట్‌చిత్రం)పై చిత్రించిన దుర్గాదేవి రూపాన్నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. సింహ వాహనంపై కొలువైన సుమారు ఆరడుగుల అమ్మవారి రూపాన్ని తరతరాలుగా ఈ కుటుంబం ఆరాధిస్తూ వస్తోంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను ఏమాత్రం విస్మరించకుండా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
షష్టి నుంచి దశమి వరకు ప్రత్యేక పూజలు
చక్రవర్తి కుటుంబంలో దుర్గా పూజను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. షష్టి రోజున అమ్మవారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదే రోజు బోధన్ అనే అమ్మవారిని మేల్కొలిపే ఆచారాన్ని నిర్వహిస్తారు. సప్తమి తెల్లవారుజామున మరో ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది. ఏడు వేర్వేరు బావుల నుంచి పవిత్రమైన నీటిని సేకరించి, సంప్రదాయ సంగీత వాయిద్యాల నడుమ ఆ నీటితో నింపిన కలశాన్ని పూజా ప్రదేశానికి తీసుకొస్తారు. గతంలో ఈ కార్యక్రమం మరింత వైభవంగా సాగేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏనుగులు, గుర్రాలతో కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేవారని, ప్రస్తుతం ఆ సంప్రదాయంలో ఆ భాగం లేకపోయినా సంగీత వాయిద్యాల మధ్య కలశాన్ని తీసుకెళ్లే ఆచారం మాత్రం కొనసాగుతోందని చెబుతున్నారు.
ఒకప్పుడు జంతుబలి.. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ
చక్రవర్తి కుటుంబం దుర్గా పూజలో గతంలో జంతుబలి ఆచారం కూడా ఉండేదట. కాలక్రమేణా ఆ సంప్రదాయాన్ని నిలిపివేసి, దాని స్థానంలో బూడిద గుమ్మడికాయను ప్రతీకాత్మకంగా బలి ఇస్తున్నారు. ఇలా పాత ఆచారానికి ప్రతీకాత్మక రూపాన్ని కొనసాగిస్తూ పూర్వీకుల సంప్రదాయాలను కాపాడుతున్నారు. సప్తమి నుంచి నవమి వరకు మహాయజ్ఞం పేరుతో పవిత్రమైన అగ్నిహోత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యజ్ఞాన్ని, దుర్గా పూజలోని ఇతర ఆచారాలను వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
అమ్మవారికి చేపల నైవేద్యం ఎందుకు?
ఈ దుర్గా పూజలో అందరినీ ఆకర్షించే మరో ప్రత్యేకత అమ్మవారికి చేపల వంటకాలను నైవేద్యంగా సమర్పించడం. పూజ ప్రారంభమైన రోజుల్లో పండ్లు, శాకాహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం చేపలతో తయారు చేసిన వంటకాలను అమ్మవారికి సమర్పిస్తారు. చద్దన్నాన్ని కూడా నైవేద్యంగా పెడతారు. చక్రవర్తి కుటుంబ సభ్యుల నమ్మకం ప్రకారం, దుర్గాదేవి కైలాసానికి తిరిగి వెళ్లిన తర్వాత శివుడు పుట్టింట్లో ఏం తిన్నావని అడుగుతాడట. అందుకే అమ్మవారు పుట్టింట్లో స్వీకరించిన ఆహారానికి ప్రతీకగా చేపల వంటకాలను నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతోందని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు.
108 నీలి కలువలతో అమ్మవారి ఆరాధన
అష్టమి రోజున ఈ కుటుంబంలో మరో విశిష్టమైన పూజ జరుగుతుంది. దుర్గాదేవికి 108 నీలి కలువ పువ్వులతో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం పవిత్రమైన పుష్పాలతో దేవతను ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. ఈ పూజా విధానం చక్రవర్తి కుటుంబ దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కుటుంబ సభ్యులు ఇప్పటికీ భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు.
దశమితో ముగిసే పూజా వేడుకలు
దుర్గా పూజ చివరి రోజైన దశమి నాడు సంప్రదాయ ఆచారాలను నిర్వహించిన అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. పూజా కార్యక్రమాల కోసం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చక్రవర్తి కుటుంబ సభ్యులు సైతం తమ స్వస్థలానికి చేరుకుంటారు. ఈ వేడుకలో పూజలు, యజ్ఞాలు, సంప్రదాయ ఆచారాలతో పాటు కుటుంబ సభ్యుల సమ్మేళనం కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఎక్కడ నివసిస్తున్నప్పటికీ ప్రతి ఏడాది దుర్గా పూజకు కుటుంబ సభ్యులు తిరిగి రావడం ఆనవాయితీగా మారింది.
సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుర్గా పూజలో కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ, పూర్వీకుల నుంచి వస్తున్న ప్రధాన ఆచారాలను మాత్రం చక్రవర్తి కుటుంబం ఇప్పటికీ భక్తితో కొనసాగిస్తోంది. అందుకే మిడ్నాపుర్‌లోని ఈ కుటుంబ దుర్గా పూజ బంగాల్‌లోని ప్రత్యేకమైన సంప్రదాయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
(Disclaimer: ఈ కథనంలోని ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఆయా కుటుంబాలు, ప్రాంతాల్లో తరతరాలుగా పాటిస్తున్న నమ్మకాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిర్ధారించిన విషయాలుగా పరిగణించకూడదు.)




