AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో రికార్డ్.. మలేషియాలో అప్‌లోడ్.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్ టు హోమ్ సినిమా..!

మీకు అర్థమవుతోందా? కంటెంట్ చోరీతో భారతీయ సినిమాకు ఏటా 22 వేల 400 కోట్ల నష్టం వస్తోంది. మీకు అర్థమవుతోందా? కేవలం ధియేటర్లో జరిగే పైరసీతోనే 13 వేల 700 కోట్ల రెవెన్యూ తగ్గుతోంది. నకిలీ ఓటీటీ యాక్సెస్‌తోనే సినిమా పరిశ్రమకు ఏటా 8 వేల 700 కోట్ల బొక్క పడుతోంది. పైరసీగాళ్ల అరాచకాలతో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే జీఎస్టీ రాబడి 4 వేల కోట్లు తగ్గుతోంది. స్ట్రీమింగ్ వెబ్‌సైట్ల మీదే 63 శాతం మంది కొత్త సినిమాలు చూస్తున్నారు. భారతదేశంలో 51 శాతం మంది సినీ లవర్స్ ఏదో ఒక రూపంలో పైరసీ కంటెంట్‌ను చూడ్జానికే ఇష్టపడుతున్నారు తప్ప థియేటర్‌కు వెళ్లడం పూర్తిగా మానేశాడని. ఇదే గనుక కంటిన్యూ ఐతే త్వరలో ఇండియన్ సినిమా, మరీముఖ్యంగా భారతీయ సినిమాకి గుండెకాయ లాంటి తెలుగు సినిమా చచ్చిపోతుందని. ఎస్.. దిసీజ్ ది ఎండ్ ఆఫ్ ది సినిమా అనడానికి మరో కారణం దొరికింది. ఏమిటదో తెలుసుకుందాం..

కర్నూలులో రికార్డ్.. మలేషియాలో అప్‌లోడ్.. ఒక్క క్లిక్‌తో డైరెక్ట్ టు హోమ్ సినిమా..!
Film Piracy In India
Balaraju Goud
|

Updated on: Nov 21, 2026 | 9:02 PM

Share

మధ్యతరగతి కుటుంబానికున్న ఒక్కగానొక్క రంగుల కల ఏంటంటే ఇంకేంటి సినిమానే. కానీ, అది మసకబారి చాలా రోజులే ఐంది. బలమైన మాస్ మీడియా అనుకున్న సినిమా మాధ్యమానికి చెదలు పట్టి చాన్నాళ్లే ఐంది. కరోనా రక్కసి వెక్కిరించి, లాక్‌డౌన్‌ రెవెల్యూషన్‌తో సగానికి సగం చిక్కిపోయిన సినిమా పరిశ్రమ.. ఓటీటీ విప్లవానికి పూర్తిగా సరెండరైంది. కొంత గ్యాప్ తర్వాత ఆడియన్స్‌ కూడా బ్యాక్‌ టు థియేటర్స్ అనడంతో సినిమాకు లైఫ్ వచ్చినట్టయింది. వరసబెట్టి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజౌతున్నాయి, ఇంకేముంది.. సినిమాకు పూర్వ వైభవం వచ్చినట్టేగా అనుకున్నారు. కానీ, సగటు సినిమాకు ఆగర్భ శత్రువు ఒక్కడున్నాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడు. సినిమాను బతకనిచ్చేదే లేదని నల్లముసుగేసుకుని నక్కి కూర్చున్నాడు. అవును, సినిమాను మళ్లీ బెదరగొట్టడం మొదలుపెట్టాడు పైరసీ మాయగాడు.

శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమా తీసేవాళ్లకీ, సినిమా చూసేవాళ్లకీ ఉమ్మడిగా పండగొచ్చినట్టే..! ఒకటీ రెండూ కాదు ఒక్కోసారి అరడజను సినిమాలొచ్చి మీద పడిపోతాయి. తియ్యటి దండయాత్ర షురూ చేస్తాయి. కానీ, మీకే కాదు, మాకూ గుడ్‌ఫ్రైడేనే అని శుక్రవారం కోసం కళ్లు కాయలయ్యేలా వెయిటింగ్‌లో ఉంటున్నారు అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉన్న పైరసీ మాయగాళ్లు. కొన్ని రోజులుగా గ్యాప్ ఇచ్చినట్టు కనిపించినా, మళ్లీ జడలు విప్పి, ఒరిజినల్ ఇండస్ట్రీకే సవాల్ విసురుతోంది పైరసీ ఇండస్ట్రీ.

నిన్నమొన్నే బిగ్‌స్క్రీన్‌ని టచ్ చేసిన ఆకాశంలో ఒక తార..! చిన్న బడ్జెట్ సినిమానే అయినా, మూడు ప్రిస్టీజియస్ బ్యానర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దుల్కర్ సల్మాన్‌ని హీరోగా పెట్టి మంచి కంటెంటున్న సినిమాగా ప్రమోట్ చేసుకుని, రిలీజ్ డేట్‌ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ రిలీజ్‌రోజే వాళ్లపాలిట పీడకలగా మారిందా? థియేటర్లో బొమ్మ అలా పడిందో, కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో ఇలా ప్రత్యక్షమైంది. ఈ బాధ ఆకాశంలో ఆ ఒక్క తారకే పరిమితం కాలేదు. గతంలోనే రిలీజై థియేటర్ రన్ దాదాపుగా పూర్తి చేసుకున్న రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం సినిమాలు కూడా డార్క్ వెబ్‌సైట్ బాధితుల జాబితాలో చేరిపోయాయి.

ఇప్పటికే పైరసీ వెబ్‌సైట్‌తో బాగా దెబ్బయిపోయి, కలెక్షన్లకు బొక్కపడి కుయ్యోమొర్రో అంటున్నాయి ఆ నాలుగు సినిమాలు. అందుకే, డొమైన్ పేరు పబ్లిష్ చేయడం నైతికం కాదు కనుక ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, ఇప్పటికే ఆ కంటెంట్ చోరగాళ్ల పనిపట్టడమైతే గ్రాండ్‌గానే మొదలైంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలర్ట్ కావడమే కాదు, యాంటీ వీడియో పైరసీ సెల్‌తో ఫిర్యాదు చేయించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు కూడా నమోదైంది. ఇంతకీ థియేటర్‌ను దాటి సినిమా ఎలా బైటికొచ్చింది.. ? సినిమాలను ఎక్కడ రికార్డు చేశారు? అని మూలాల కోసం సినిమాను ఎగ్జిబిట్ చేసిన క్యూబ్ సినిమా టెక్నాలజీస్‌ను కదిలించారు. డీప్‌గా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే.. కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ మల్టీప్లెక్స్‌ను, SVC సినిమాస్‌ను చూపిస్తోంది. అక్కడే దొంగచాటుగా కుర్చీల వెనుక కెమెరాతో మాటువేసి రికార్డు చేసినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజీ, టికెట్ బుకింగ్ డీటెయిల్స్‌ తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

రణబాలి, ఏకే47, కల్ట్ సినిమాల పైరసీపై కూపీ లాగుతుండగానే, నవంబర్ 20 థియేటర్లలోకొచ్చిన కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’ కూడా వెబ్‌సైట్‌లో దొరికింది. రిలీజైన రోజే వెబ్‌సైట్‌లో కనిపించడంతో ఇండస్ట్రీ మొత్తం షాకైంది. ఈ నాలుగు సినిమాల పైరసీ వెనుక ఒకే ఆర్గనైజ్డ్‌ ముఠా ప్రమేయం ఉండవచ్చని సైబర్ సెక్యూరిటీ భావిస్తోంది. సినిమాను రికార్జ్ చేసిన చిన్నచిన్న పాత్రధారులే కాదు, వాళ్ల వెనకున్న పెద్దపెద్ద సూత్రధారులను పట్టుకుని లోపలేసే పనిలో ఉన్నారు పోలీసులు.

ప్రస్తుతానికి ఇద్దరు దొరికారు. కర్నూలుకు చెందిన రిజ్వాన్, రాంపోగు అజయ్‌ను అరెస్ట్ చేసి లోపలేశారు. మంచి విజువల్ క్వాలిటీ ఉన్న ఫోన్లతో థియేటర్లలో దూరిపోయి, సినిమాలు రికార్డ్ చేశామని, గోఫైల్ అనే వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాల కంటెంట్‌ని అప్‌లోడ్ చేశామని, తెలిసిందంతా కక్కేశారు. సినిమాకో 20 వేలు దక్కుతాయని, క్రిప్టో కరెన్సీ రూపంలో పేమెంట్స్ జరుగుతాయని ఇంకాఇంకా చాలానే చెప్పారు. ఎవ్వరికీ డౌట్ రాకుండా టెలిగ్రామ్‌తో కనెక్టై ఉంటుందట వీళ్ల నెట్‌వర్క్. కొసమెరుపు ఏంటంటే, 4 వేల కోట్లతో తీసిన రామాయణ్ సినిమాను కూడా వదల్లేదు ఈ లిటిల్ రాస్కెల్స్.

ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం, సినిమాటోగ్రఫీ చట్టంతో బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద బలంగా కేసులు పెట్టి గట్టిగానే విచారిస్తున్నారు. కానీ, ఇండియాలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో పైరసీ మూలాలు బయపడ్డం కొత్తేమీ కాదుగా? గతంలో ఐబొమ్మ లాంటి మెగామెగా పైరసీ రాకెట్లను ఛేదించి, ఆల్ సెట్, నో పైరసీ ఫికర్ అని భరోసా ఇచ్చింది సైబర్ సెక్యూరిటీ సెల్. కానీ, ఊడలమర్రిలా మారిన పైరసీ నెట్‌వర్క్ రెస్ట్ తీసుకున్నట్టు లేదు. చిన్న గ్యాప్ ఇచ్చా ఇదిగో మళ్లీ వచ్చేశా అని రెచ్చిపోయి ఇండస్ట్రీని మళ్లీ కుంగదీస్తోంది పైరసీ భూతం.

పరాయి రాష్ట్రంలో బాగా ఆడిన సినిమాలను చూపించి, మనోళ్లకు సినిమా తీయడమే రాదా అని దెప్పిపొడవడం, వచ్చిన సినిమాలను కూడా నెగిటివ్ రివ్యూలతో చావబాదడం.. దీంతోనే సరిపోయింది మనోళ్లకు. కానీ, టెక్నాలజీతో పోటీపడి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, షేపులు మార్చుకుని సినిమా పాలిట స్లోపాయిజన్‌గా మారిన పైరసీని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నామా? అంటే అవుననిపిస్తుంది.

థియేటర్లో మార్నింగ్‌షో పడగానే.. మన హోమ్‌ థియేటర్లో మ్యాట్నీ షో రెడీ అవుతోంది. సేమ్ మూవీ, సేమ్ క్వాలిటీ.. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టిక్కెట్ ప్రైస్‌తో సంబంధం లేదు. బుకింగ్ కోసం క్యూలైన్‌లో నిలబడేది లేదు. ఆన్‌లైన్‌లో ఎవైలబిలిటీ చూసే ప్రయాసా లేదు. అర్థ రూపాయి ఖర్చు లేకుండా కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్న వాళ్లు మన మధ్యలోనే కోకొల్లలు. అసలే సినిమా కష్టాలు చుట్టుముట్టి చితికిపోతున్న ఇండస్ట్రీని జీరో సైజుకు పడగొడుతూ క్యాన్సర్‌ పుండులా ముదురుతోంది కంటెంట్ పైరసీ. ఇంకానా ఇకపై చెల్లదు అంటూ సినిమా పెద్దలు నడుం కట్టినా ఫలితం మాత్రం శూన్యమేనా?

సినిమా ప్రేమికులు పుష్కలంగా ఉండబట్టి, పైరసీగాళ్లకు మన దేశమే స్వర్గధామం అవుతోంది. ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద పైరసీ మార్కెట్‌ మనదే అంటే నమ్మాల్సిందే..! ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా పైరసీ వెబ్‌సైట్లను 21,630 కోట్ల మంది విజిట్ చేస్తే, మనదేశం నుంచే ఏకంగా 17 వందల కోట్లమంది పైరసీ వెబ్‌సైట్స్‌ను బ్రౌజ్ చేస్తున్నట్టు ఓ లెక్కుంది. మొన్నీమధ్యే మన హైదరాబాద్‌లోనే దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ రాకెట్ బయటపడింది. ఐదేళ్లలో వెయ్యికి పైగా సినిమాలు చోరీకి గురైనట్టు తేలింది. ఈ లెక్కలన్నీ ఏం చెబుతున్నట్టు?

తరిమికొట్టేకొద్దీ తరుముకుంటూ వస్తోంది పైరసీ భూతం. దశాబ్దాల పాటు ఎన్నిరకాలుగా నియంత్రణ చర్యలు చేపట్టినా, అన్నీ వృధా ప్రయాసలుగానే మిగిలిపోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్తరూపంలో దూసుకొస్తూనే ఉంది పైరసీ ముప్పు. మొదట్లో సీడీలతో మొదలైంది. తర్వాత ధియేటర్లలో చిన్న కెమెరాలతో షూట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేదాకా ముదిరింది. ఇప్పుడైతే నేరుగా మాస్టర్ ప్రింటే అప్‌లోడ్ చేసే రేంజ్‌కి చేరుకుంది పైరసీ మాఫియా.

పైరసీ వెబ్‌సైట్లలో సినిమా చూస్తే మిగిలేది రెండొందలో మూడొందలో అంతే. కానీ, ఆ సినిమాను తీసేవాళ్లకు మాత్రం కోట్లల్లో నష్టం. మొత్తం ఇరవైనాలుగు విభాగాల్లో ఎక్స్‌పర్ట్స్‌ తమ మేథస్సును పెట్టుబడిగా పెట్టి అత్యంత శ్రమకోర్చి ఒక సినిమా తీస్తే… అది కాస్తా పైరసీగాళ్ల చేతివాటానికి దొరికి.. టోటల్‌గా సినిమా పరిశ్రమకే దెబ్బయిపోతోంది. జానా కిరణ్ కుమార్.. ఈ పేరు గుర్తుందా? వీడు ఒకేఒక్కడు.. కానీ, 50కి పైగా సినిమాల్ని దొంగిలించి పైరసీ వెబ్‌సైట్లకు అమ్మిపారేశాడు. 2019 నుంచి పైరసీనే వృత్తిగా మార్చుకుని ఈజీగా బతుకుబండి లాగేస్తున్నారు ఇటువంటి ఆవారాగాళ్లు. ఇంతకంటే దారుణం ఏంటంటే, కొన్నిచోట్ల థియేటర్ యాజమాన్యాలే పైరసీగాళ్లతో డీల్ కుదుర్చుకోవడం. ఈ విధంగా ప్రతీచోటా పోగైన పైరసీ గుంపు, తాము నిలబడ్డ కొమ్మనే నరుక్కుంటున్నారు. తల్లి లాంటి సినిమా ఉనికినే దెబ్బతీస్తున్నారు.

పైరసీకి దొరక్కుండా పరిశ్రమలో ఎవరికివాళ్లు ఎంతోకొంత సొంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజమౌళి తీసే బడా సినిమాల రిలీజప్పుడు గాని, గీతా ఆర్ట్స్‌ లాంటి బిగ్గెస్ట్ బ్యానర్ల నుంచి సినిమాలు వస్తున్నప్పుడు గానీ పైరసీగాళ్లపై ఓ కన్నేసే ఉంచుతారు నిర్మాతలు. 100కు పైగా లింకుల్ని డిలీట్ చేయించారు కూడా. అయినా.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఫిలిమ్ ఛాంబర్లన్నీ ఏకమై… టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు అందరు సినీ పెద్దలూ ఒక్కటై ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ సిట్యువేషన్‌ వచ్చేసిందా?

ఎవడో ఏదో థియేటర్లో దూరి చాటుమాటుగా ఫోన్‌లో రికార్డ్ చేసి అప్‌లోడ్ చెయ్యడం.. ఆ వెబ్‌సైట్‌ను మన బ్రౌజర్‌లో ఓపెన్ చేసి సినిమాను అప్పనంగా చూసుకోవడం.. పైరసీ అంటే ఇంతే అనుకుంటాం. కానీ, ఇది పైరసీ సబ్జెక్ట్‌లో టెన్‌ పర్సెంట్ మాత్రమే. మిగతా 90 శాతం పైరసీ ఇంకోటుంది. దానిగురించే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. అదేంటంటే, సినిమా కంటెంట్‌ని కాదు, సినిమా ఒరిజినల్‌నే దోచుకోవడం. అవును.. మన సినిమావాళ్లు ఏళ్లకేళ్లు రేయింబవళ్లు కష్టపడి షూటింగులు ఎడిటింగులు పూర్తిచేసి, అలా వచ్చిన ఫైనల్ కాపీల్ని చాలా భద్రంగా దాచుకుంటారు. కంటెంట్ మొత్తాన్ని రిలీజ్‌కు ముందు డిజిటల్ మీడియా ఏజెన్సీలకు అప్పగించి, వాళ్ల సర్వర్లలో దాచిపెట్టుకుంటారు. అంతకంటే హైలెవల్ సెక్యూరిటీ ఇంకెక్కడా ఉండదని, అక్కడి నుంచి ఒక్క ఫ్రేమ్ కూడా బైటికి వెళ్లదు అని వాళ్ల నమ్మకం. కానీ.. పాట్నాలో తన ఇంట్లో కూర్చుని ఒకడు డిజిటల్ సర్వర్లలో జొరబడి, మూడో కంటికి తెలీకుండా మాస్టర్ ప్రింట్‌ను తస్కరిస్తాడు.. పైరసీ చేసి సొమ్ము చేసుకుంటారు. ఇది కదా జరుగుతున్న దారుణం.

లక్షల్లో సబ్‌స్క్రైబర్లుండే ఓటీటీ కంపెనీలకు, కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు కంబైన్డ్‌గా మొన్నటిదాకా ఒకేఒక పెద్ద తలనొప్పి.. మోస్ట్ పాపులర్ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ. దీని గురించి తెలీని నెటిజన్లే లేరు. ఒక నెలలో సగటున 27 లక్షల మంది విజిటర్లు వస్తారంటే ఐబొమ్మకుండే పాపులారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఏడాది కిందట ఐబొమ్మ వెనకుండే మాస్టర్ మైండ్ దొరికాడు. తెలుగు, హిందీ, తమిళం సినిమాలు, OTT కంటెంట్‌ను దొంగచాటుగా లేపేసి, ఐబొమ్మ పేరుతో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి అందులో అప్‌లోడ్ చేసి, తెలుగు సినీ పరిశ్రమకే దాదాపు 3 వేల కోట్లు గండి కొట్టేశాడు.

చిక్కడు దొరకడు అనుకున్న ఐబొమ్మ ఆటగాడు ఇమ్మడి రవి పోలీసుల వల్లో చిక్కేశాడు. వీడు దొరకడానికి ముందు ఇంకొకడూ దొరికాడు. పేరు అశ్వినీ కుమార్. కేరాఫ్ పాట్నా. ఇతడందించిన ఉప్పుతోనే పైరైట్ క్రైమ్ సిండికేట్ మొత్తం కదిలింది. ఐబొమ్మ సృష్టికర్త ఇమ్మడిరవి ట్రాప్‌లో పడ్డాడు. ఒక్క ఐబొమ్మకే కాదు, వన్ తమిళ్ బ్లాస్టర్స్, వన్ తమిళ్ MB, 5 మూవీరూల్స్.. ఇలాంటి అనేక పైరసీ వెబ్‌సైట్స్‌కి కంటెంట్ ప్రొవైడ్ చేసే పదిమంది పైరసీ అడ్మినిస్ట్రేటర్లను, పైరసీ చీకటి కార్మికుల్ని పట్టుకున్నారు పోలీసులు. అంటే, దాదాపు పైరసీ నెట్‌వర్క్‌ మొత్తం గుప్పిట్లో చిక్కినట్టే. కానీ, పైరసీ మూలాలు మాత్రం ఇంకా బతికే ఉన్నాయి.

సినిమా చౌర్యాన్ని సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ పోలీస్ విభాగం. పైరసీ వెబ్‌సైట్స్ ఎలాంటి టెక్నాలజీ వాడినా సరే పట్టుకుంటామని హెచ్చరిస్తూ వస్తోంది. లోకల్ పోలీసులు, ఫిలిమ్‌ఛాంబర్ ఇంటిలిజెన్స్, యాంటీపైరసీ సెల్.. ఈ మూడూ కలిసి చేసిన ట్రయాంగులర్ ఎఫర్ట్ పెట్టి, పైరసీ రాకెట్లను ఛేదిస్తూనే ఉన్నారు. కానీ, సగటు సినిమాకు భరోసా మాత్రం దొరకడం లేదు. ఇప్పుడు ట్రేసౌట్ ఐన వెబ్‌సైట్ ఐబొమ్మను మించిన స్పీడ్‌తో పని చేస్తోంది. ఒక్క క్లిక్‌తోనే డజన్ల కొద్దీ సినిమాల్ని బ్రౌజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సినిమా థియేటర్లో విడుదలైన పది గంటల్లోపే అప్‌లోడ్‌ ఐందంటే ఆ వెబ్‌సైట్ ఐబొమ్మ కంటే పవర్‌ఫుల్ అని భావిస్తోంది ఇండస్ట్రీ.

అనైతికం అని తెలిసినా ప్రేక్షకులు పైరసీ వైపు ఎందుకు చూస్తున్నారు అనే రిసెర్చ్ కూడా జరిగింది ఇండస్ట్రీలో. ముఖ్యంగా వినిపించిన కారణం.. థియేటర్లో సినిమా టిక్కెట్ రేట్లు. ఇప్పుడున్న ధరల్లో ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లాలంటే ఎంత ఖర్చవుతోంది అనే భయపెట్టి చంపేస్తోంది. ఈ ఫికర్ వల్లే మిడిల్‌క్లాస్ ఫ్యామిలీస్ థియేటర్ల వైపు చూడ్డం మానేశాడు. అందుకే, ఫస్ట్‌డే ఫస్ట్‌షో కిక్‌ను ఎంజాయ్ చేయాలనుకునే హార్డ్‌కోర్ ఆడియన్స్ మాత్రమే టికెట్ కొని సినిమాకెళ్తున్నాడు. కానీ, ఇప్పుడొస్తున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ వసూళ్లు సరిపోవు. రిపీట్ ఆడియన్స్ కావాల్సిందే. కుటుంబ సమేతంగా సినిమా చూడాల్సిందే. కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్లగలిగేలా టికెట్ ధరలను తగ్గించడం, OTTల దూకుడును నియంత్రించడం.. ఈ రెండు పనులూ చేస్తేనే ప్రేక్షకజనం పైరసీ జోలికి వెళ్లకుండా చూడొచ్చు. పైరసీపై తమిళనాడు ప్రభుత్వమైతే పూర్తిస్థాయిలో ఫైటింగ్ మొదలుపెట్టింది. గతంలో పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు హీరో విశాల్. చివరకు, టిక్కెట్ల రేట్లు సామాన్యులకు అందుబాటులోకి తేవడమే ఏకైక మార్గమని గ్రహించినట్టుంది విజయ్ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు కూడా పడ్డాయి. మన తెలుగు పరిశ్రమలో ఆ సోయి ఎంతమందికుంది?

పైసావసూల్‌ ఒక్కటే కాదు, అంతకుమించి జరుగుతోంది నష్టం. దర్శకులు, రచయితలు, నటీనటుల కష్టానికి గుర్తింపు తగ్గుతూ వస్తోంది. ఉన్న స్కిల్ అంతా ట్రెడిషనల్ సినిమాను ఒదిలిపెట్టి మిగతా ప్లాట్‌ఫామ్స్‌ వైపు పరుగు పెడుతోంది. సినిమాలో క్రియేటివిటీ తగ్గిపోయే ప్రమాదముంది. అటు, రోజువారీ వేతనంపై పనిచేసే టెక్నీషియన్లు, కార్మికులకు ఉపాధి కరువై రోడ్డున పడతారు. అల్టిమేట్‌గా పైరసీతో మొత్తం సినిమా ఆత్మకే వంచన జరుగుతోంది.

అన్నిటిలాగే సినిమా కూడా డిజిటలైజ్ అయ్యింది. ప్రొడక్షన్ నుంచి ఎగ్జిబిషన్ దాకా అన్నీ డిజిటల్‌లోనే. నో మ్యాన్యువల్. కానీ, టెక్నాలజీ కత్తికి రెండు వైపులా పదునుందిగా..? ఆ రెండోవైపును పైరసీ చోరులు అడ్డంగా వాడేస్తున్నారు. పైరసీ వెబ్‌సైట్స్‌లో ఉండే సినిమాల్లో ఆడియో-వీడియో సిగ్నేచర్స్‌ని పరిశీలించి, పైరైటెడ్ మూవీలో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని, కెమెరా యాంగిల్‌ని, హాల్ ఆంబియన్స్‌ని సింక్ చేసి… ఈ కంటెంట్ ఏ ధియేటర్‌లో ఏ స్క్రీన్‌లో, ఎక్కడ కెమెరా పెట్టి రికార్డ్ చేశారో తెలుసుకునే టెక్నాలజీ వచ్చేసింది. అయినాసరే, మనల్నెవడ్రా ఆపేది అని బిందాస్‌గా దూసుకెళ్తున్నారు పైరసీగాళ్లు. ఒకర్ని లోపలేస్తే ఇంకోడొస్తాడు. అందుకే, సినిమా పైరసీ అనేది అంతులేని కథ అంటున్నాం. ప్రేక్షక మహాశయుడ్ని మళ్లీ ఫిదా చేసుకోవాలంటే ప్లాన్‌బీ, ప్లాన్‌సీ చూసుకోక తప్పదు అంటున్నాం..!

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us