ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండవచ్చా..? ఈ పని చేస్తే భారీ పెనాల్టీ..
దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ పాన్ కార్డు అనేది అవసరం. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు వరకు ప్రతీపనికి ఇది ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది రెండు పాన్ కార్డులను కలిగి ఉంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటారు. కానీ..

పాన్ కార్డు అనేది దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా, మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి శాలరీ పొందాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా పాన్ కార్డు అనేది తప్పనిసరిగా చెప్పవచ్చు. ఇదేకాక ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగానే ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒకే వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండవచ్చా? ఉంటే ఎంతవరకు జరిమానా పడుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
రెండు పాన్ కార్డులు కలిగి ఉండవచ్చా..?
ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం అనేది నేరంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఒక పాన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి. రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు తేలితే ఆదాయపు పన్ను శాఖ మీపై చర్యలు తీసుకునే అవకాశముంది. మీపై భారీగా జరిమానా కూడా విధించవచ్చు. తాజాగా గుజరాత్‌కు చెందిన ఒక బాణసంచా వ్యాపారి రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నందుకు పన్ను నోటీసులు పొందాడు. ఆ వ్యాపారి ఒక పాన్‌పై వ్యాపార ఆదాయం చూపించి పన్ను కట్టగా.. రెండో పాన్ నెంబర్‌పై ఆదాయం దాచిపెట్టారంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. అతడికి ఏకంగా రూ.7.60 లక్షల అదనపు పన్ను డిమాండ్ విధించింది. దీనిపై వ్యాపారికి ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఊరట కలిగించింది.
కమిషనర్ (అప్పీల్స్) ఉత్తర్వులను పక్కన పెడుతూ ఈ కేసును తిరిగి అసెసింగ్ ఆఫీసర్ వద్దకు అహ్మదాబాద్ బెంచ్ పంపించింది. అయితే ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు ఉన్నంత మాత్రాన ఆదాయాన్ని దాచిపెట్టినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకే ఆదాయంపై రెండుసార్లు పన్ను పడినట్లు నిర్దారించలేమని చెబుతున్నారు. ఐటీ శాఖ విచారణ జరిపేటప్పుడు పన్నుదారుడు దాఖలు చేసిన రిటర్న్స్, ఆదాయం, చెల్లించిన పన్నును పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐటీ నోటీసులకు సరైన సమయంలో స్పందించి ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు.
