చర్మం మెరుపు, కండరాల బలం, ఫిట్ బాడీ.. ఇవన్నీ ఈ 5 బ్యూటీ ఫుడ్స్‌తో సాధ్యమే..
Beauty Foods: చర్మం ఆరోగ్యంగా మెరవడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం కీలకం. గుడ్లు, బ్లూబెర్రీస్, సాల్మన్ చేప, కివి, బ్రోకోలీ వంటి ఆహారాల్లో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయని.. వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యం, అందం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని లోపల నుండి దృఢంగా, బయట నుండి ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. అందుకే.. మంచి పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందం, ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన కీలకమైన ఐదు సూపర్ ఫుడ్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
గుడ్లు: గుడ్లు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఆహారం. ఇవి కండరాల నిర్మాణానికి, చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడతాయి, తద్వారా ఆరోగ్యకరమైన చర్మానికి, ఫిట్ బాడీకి దోహదపడతాయి. అయితే.. గుడ్లను ఆమ్లెట్ కంటే.. ఉడికించిన గుడ్లు తినడం మంచిది.
బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్ రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.. గుండె జబ్బుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. బ్లూబెర్రీస్‌లో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, విటమిన్ కె జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
సాల్మన్ చేప: సూపర్ ఫుడ్స్ జాబితాలో సాల్మన్ చేప ముఖ్యమైనది. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఈ చేప తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒమేగా-3లు చర్మ ఆరోగ్యం, మెదడు పనితీరుకు కూడా మేలు చేస్తాయి.
కివి పండు: విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ పండు కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉండటం వల్ల ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో తగినన్ని తెల్ల రక్త కణాలు ఉండేందుకు కివి పండు వినియోగం దోహదపడుతుంది.
బ్రోకోలీ: క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకోలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని వండుకుని లేదా పచ్చిగా తిన్నా మంచిదే. బ్రోకోలీలోని విటమిన్ కె, కాల్షియం ఎముకలను బలోపేతం చేయడమే కాక, ఇందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ఆకలిని నియంత్రించి, బరువు పెరగకుండా సహాయపడుతుంది, తద్వారా ఫిట్ బాడీని సొంతం చేసుకోవచ్చు.
ఈ సూపర్ ఫుడ్స్‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు మెరిసే చర్మాన్ని, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు.. అయితే.. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
