Andhra Pradesh: మహిళలకు ఉచిత బస్ పథకం…అమలు దిశగా ఏపీ సర్కారు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతికి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం కొన్ని కారణాలతో మరికొంత కాలం వెయిట్ చేయనుంది. ప్రధానంగా ఈ ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తాజాగా దృష్టి సారిస్తోంది. ఇందులో ప్రధానంగా మహిళల ప్రయాణానికి ఉచిత బస్ సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఈ పథకం అమలుపై సమగ్రమైన అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రుల కమిటీ ఏర్పాటు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని చైర్మన్‌గా నియమించి, హోం శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులను సభ్యులుగా చేర్చుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో హోం మంత్రి అనిత… మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిలు ఈ కమిటీలు సభ్యులుగా వ్యవహరించబోతున్నారు
పథకం అమలవుతున్న రాష్ట్రాల పర్యటన – అధ్యయనం
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలో అనేక అంశాలని పేర్కొంది. ప్రధానంగా ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలను సందర్శించి, అక్కడి అమలు విధానాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.
ఏ రాష్ట్రాల్లో అమలవుతోంది?
మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ఉచిత బస్ పథకాన్ని అమలు చేసిన కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది.
కమిటీ నివేదిక దేనిపై ఉండబోతోంది
ప్రధానంగా ఈ క్యాబినెట్ పలు కీలక అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతమంది మహిళలు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి ప్రయాణించే మహిళల సంఖ్య ఎంత? పథకం అమలైన తర్వాత ఇతర రాష్ట్రాల్లో పెరిగిన ఆక్యుపెన్సి ఎంత? అందుకు అవసరమైన బస్సులు ఎన్ని? ఏ బస్సు సర్వీసులలో ఈ పథకాన్ని అమలు చేయాలి? కేవలం జిల్లాల వరకు మాత్రమే దీన్ని పరిమితం చేయాలనా? లాంటి అనేక అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వబోతుంది
సూపర్ సిక్స్ పథకాల్లో భాగం
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పటికే ఇందులో భాగంగా దీపం పథకాన్ని అమలు చేసి సంవత్సరానికి మూడు వంట గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా అందించే పథకానికి ఇటీవలనే స్వీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి నుంచి ఈ పథకం ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఉచితంగా అందించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. మిగతా ఐదు పథకాలతో పాటు ఈ పథకం కూడా త్వరలో అమలులోకి రానుంది
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు ప్రయాణంలో ఆర్థిక భారం తగ్గించడంలో తోడ్పడుతుందన్న అభిప్రాయం ప్రభుత్వానిది. పథకం పూర్తి స్థాయిలో అమలవ్వడం ద్వారా మహిళలు మరింత స్వేచ్ఛగా, సురక్షితంగా ప్రయాణించగలగడం సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ వర్గాల వాదన
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..