Andhra Pradesh: కమలంతో కటీఫ్.. సైకిల్ తో సై.. పవన్ వ్యూహాం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీజేపీతో కొనసాగుతున్న పొత్తును వదులుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జట్టు కడతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే..

Andhra Pradesh: కమలంతో కటీఫ్.. సైకిల్ తో సై.. పవన్ వ్యూహాం ఇదేనా..?
Chandra Babu Naidu, Pawan Kalyan
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 18, 2022 | 9:17 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. బీజేపీతో కొనసాగుతున్న పొత్తును వదులుకుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జట్టు కడతారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుంటానని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సమయంలోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి రెండు పార్టీల మధ్య సమన్వయం లోపం తీవ్రంగా కనిపిస్తోందని, బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకుల వైఖరిపై పవన్ కళ్యాణ్ గుస్సాగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖపట్టణంలో తాజాగా జరిగిన సంఘటనతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహ్యాన్ని ఒక్కసారిగా మార్చేశారు. వైసీపీ అరాచకాలను సాగనివ్వనని గట్టిగా కౌంటరివ్వడంతో పాటు.. వైసీపీ అధికారంలోకి రాకుండా చూస్తానని సవాలు విసిరారు. దీంతో ఇక ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ గా తన కార్యాచరణను అమలు చేసేయాలని జనసేనాని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ విజయవాడలో అక్టోబర్ 18వ తేదీ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంపై ఎన్నికల్లో పొత్తుల విషయం ప్రస్తావించలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలను ఐక్యం చేసే అంశంపైనే చర్చించినట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికి, రాజకీయాంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఒంటిరిగా పోటీచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువని గ్రహించిన జనసేనాని, బీజేపీకి రాష్ట్రంలో పెద్ద బలం లేకపోవడంతో తన లక్ష్యం నెరవేరాలంటే బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు కారణంగా చంద్రబాబునాయుడుని బీజేపీ దూరం పెట్టింది. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. చంద్రబాబు నాయుడు మాత్రం గత వైరాన్ని పక్కన పెట్టి బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ మాత్రం సిద్ధంగా లేదు.

2014 ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. అప్పుడు జనసేన పోటీచేయనప్పటికి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. ఆతర్వాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో విబేధించి పవన్ కళ్యాణ్ కమలం పార్టీకి దూరమయ్యారు. అదే సమయంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి విషయంలో తలెత్తిన పొరపచ్చాలతో చంద్రబాబునాయుడు, బీజేపీ మధ్య పొత్తుకు బ్రేక్ పడింది. దీంతో కేంద్రంలో మంత్రిగా ఉన్న టీడీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో పాటు, రాష్ట్రంలో బీజేపీ నుంచి మంత్రులుగా ఉన్న దివంగత పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీచేయగా.. మూడు పార్టీలు ఘోర పరజాయాన్ని చవి చూశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ ఖాతా తెరవలేదు.

ఇవి కూడా చదవండి

2019 ఎన్నికల తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మొదట్లో ఇరు పార్టీల నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య సమన్వయ లోపం తీవ్రంగా కనిపించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒకటే మార్గమని జనసేనాని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల పొత్తుల అంశం ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీని కూడా తమ కూటమిలో చేర్చుకుని, 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేయాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే దీనికి బీజేపీ మాత్రం సానుకూలంగా ఉన్నట్లు కనబడటం లేదు. ఒక వేళ జనసేనాని బీజేపీకి కటీఫ్ చెప్పి, టీడీపీతో జట్టుకడితే బీజేపీ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..