Pawan Kalyan: పవన్ సంకల్పానికి అంజనమ్మ సాయం..చనిపోయిన కౌలు రైతుల కోసం తన వంతుగా విరాళం..
Janasena Koulu Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'కౌలు రైతు భరోసా' కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి.
Janasena Koulu Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘కౌలు రైతు భరోసా’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నారు. కాగా జనసేనాని చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి మెగా కుటుంబం కూడా తోడ్పాటునందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు అందించారు. వారితోపాటు నాగబాబు-పద్మజ, పవన్ సోదరి మాధవి, ఇతర కుటుంబ సభ్యులు కూడా విరాళాలు అందించారు. తాజాగా జనసేన కౌలు రైతు భరోసాకు పవన్ తల్లి అంజనా దేవి తన వంతుగా సాయం అందజేశారు. రూ.1.50 లక్షలను కౌలు రైతు భరోసాకు ఇచ్చిన అంజనా దేవి..మరో లక్ష రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లో పవన్‌కు ఆమె విరాళం చెక్కులు అందజేశారు. తన భర్త కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు అంజనాదేవి తెలిపారు.
ఆయన జీతంతోనే పెరిగాం..
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ఏపీ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారని గుర్తుచేసుకున్నారు. ఎక్సైజ్ శాఖలో ఆయన పనిచేశారని, ఆయనకు వచ్చిన జీతంతోనే తామంతా పెరిగామన్నారు. ‘2007లో నాన్న మరణించారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ వస్తోంది. ఈ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి విరాళంగా ఇచ్చింది. పెద్ద మనసుతో ఆమె చేసిన ఈ మంచి పనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..