Done constituency: డోన్ టీడీపీ అభ్యర్థి కోట్లనేనా.. అసలు సుబ్బారెడ్డిని పిలిచి పార్టీ ఏం మాట్లాడింది?
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయం మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అంతకుముందు ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం బీఫామ్ తనకే వస్తుంది అంటూ బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. దీంతో టీడీపీ కేడర్ మొత్తం గందరగోళంలో పడిపోయింది.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో రాజకీయం మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ అధిష్టానం ప్రకటించింది. అంతకుముందు ఇంచార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి మాత్రం బీఫామ్ తనకే వస్తుంది అంటూ బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. దీంతో టీడీపీ కేడర్ మొత్తం గందరగోళంలో పడిపోయింది.
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబీకులే పోటీ చేస్తూ వచ్చారు. వైసీపీ ఆవిర్భావంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకతో డోన్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఎవరు ముందుకు రాని పక్షంలో సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ ఇంచార్జిగా ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి మూడేళ్ల క్రితమే డోన్ నుంచి సుబ్బారెడ్డి పోటీ చేస్తారని, బుగ్గనను రాజకీయంగా ఎదుర్కొంటారని ప్రకటించారు. మొదట ఏమీ లేదు. కానీ తర్వాత మెల్లమెల్లగా టీడీపీలోని ఒక వర్గం వ్యతిరేకంగా పనిచేసింది. సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వవద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటనలు చేసింది. డోన్ అభ్యర్థి వ్యవహారం పూర్తి వివాదాస్పదం కావడంతో చివరికి సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించింది పార్టీ అధిష్టానం.
సుబ్బారెడ్డి కూడా బల ప్రదర్శన చేశారు. పార్టీ అధిష్టానం పిలిపించింది. ఆ తర్వాత బీఫామ్ తనకే వస్తుందంటూ సుబ్బారెడ్డి ఏకంగా మీడియా ముందు ప్రకటించడం సంచలనంగా మారింది. కోట్లను ప్రకటించే ముందు కూడా డోన్ నియోజకవర్గంలో హైడ్రామా నడిచింది. టికెట్ సుబ్బారెడ్డికి అని, కాదు కోట్లకే అని దుమారం రేగింది. ఫ్లెక్సీలు చించుకునే వరకు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. సుబ్బారెడ్డి తాజా వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎవరు మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తారంటూ సుబ్బారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. లేదంటే ఆలూరు అసెంబ్లీ ఇస్తారని కూడా సుబ్బారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది.
దీనిని ఇతర టీడీపీ నేతలు మాత్రం పూర్తిగా ఖండిస్తున్నారు. అసత్య ప్రచారం అంటూ తీసిపారేస్తున్నారు. మరోవైపు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాత్రం ప్రచారం విస్తృతం చేశారు. సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలలో నిజం ఎంత? ఆయన మాటలకు విలువ ఉందా? కోట్లను మార్చేంత సాహసం టీడీపీ తీసుకుంటుందా? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది. అయితే మరికొందరు మాత్రం సుబ్బారెడ్డి ఏదో ఒక ఆధారం లేకుండా మాట్లాడతారా? అసలు సుబ్బారెడ్డిని పిలిపించి పార్టీ ఏం మాట్లాడింది? అనే చర్చ డోన్‌లో జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…