IPL 2026 : ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
IPL 2026 : ఐపీఎల్ 2026 వేలం కోసం బీసీసీఐ తాజాగా షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వేలం కేవలం ఒక రోజు మాత్రమే జరగనుంది కాబట్టి దీనిని మినీ ఆక్షన్ అని పిలుస్తున్నారు.

IPL 2026 : ఐపీఎల్ 2026 వేలం కోసం బీసీసీఐ తాజాగా షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ వేలం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి వేలం కేవలం ఒక రోజు మాత్రమే జరగనుంది కాబట్టి దీనిని మినీ ఆక్షన్ అని పిలుస్తున్నారు. గత సీజన్‌లో ఈ వేలం రెండు రోజులు జరిగింది. ఈ వేలం మంగళవారం, డిసెంబర్ 16, 2025 న అబు దాబి లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. వేలం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. లైవ్ ప్రసారం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో అందుబాటులో ఉండగా, లైవ్ స్ట్రీమింగ్ జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లలో వీక్షించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం జరిగే ఈ వేలంలో మొత్తం 350 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరిలో అత్యధికంగా రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న ఆటగాళ్లు 40 మంది ఉన్నారు. అలాగే తక్కువగా రూ.30 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న ఆటగాళ్లు 227 మంది ఉన్నారు. ఈ జాబితాలో 16 మంది భారతీయ, 96 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషయానికొస్తే, 224 మంది భారతీయులు, 14 మంది విదేశీయులు షార్ట్‌లిస్ట్ అయ్యారు.
ఐపీఎల్ 2026 వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లు మాత్రమే అమ్ముడయ్యే అవకాశం ఉంది. మొత్తం 10 జట్లలో 77 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో 13 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే వారు కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే నిలుపుకున్నారు. ఈ కారణంగా వేలంలో అత్యధిక పర్స్ బ్యాలెన్స్ అయిన రూ. 64.3 కోట్లు కూడా కేకేఆర్ వద్దే ఉంది.
మిగిలిన జట్లలో ఖాళీ స్లాట్‌లు, పర్స్ బ్యాలెన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద 9 స్లాట్‌లు, రూ. 43.4 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వద్ద 10 స్లాట్‌లు, రూ. 25.5 కోట్లు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వద్ద 6 స్లాట్‌లు, రూ. 22.95 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) వద్ద 8 స్లాట్‌లు, రూ. 21.8 కోట్లు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వద్ద 8 స్లాట్‌లు, రూ. 16.4 కోట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ (RR) వద్ద 9 స్లాట్‌లు, రూ. 16.05 కోట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ (GT) వద్ద 5 స్లాట్‌లు, రూ. 12.9 కోట్లు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ (PBKS) వద్ద 4 స్లాట్‌లు, రూ. 11.5 కోట్లు ఉన్నాయి. చివరగా, ముంబై ఇండియన్స్ (MI) వద్ద 5 స్లాట్‌లు మాత్రమే ఉన్నా, పర్స్ బ్యాలెన్స్ అత్యంత తక్కువగా రూ. 2.75 కోట్లు మాత్రమే ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




